తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన కమిషన్ కాల పరిమితి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గత నవంబర్ 11న బాధ్యతలు చేపట్టిన జస్టిస్ షమీమ్.. ఎస్సీ వర్గీకరణపై కూలంకషంగా అధ్యయనం చేసి 60 రోజుల్లో నివేదిక అందించాలి. జనవరి 10తో ఆ గడువు ముగియగా.. మరో పది రోజులు పెంచింది సర్కార్. అయితే ఇటీవలే కమిషన్ తన అధ్యయన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
అయితే ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ సహ మరికొందరు నేతలు పలు అభ్యంతరాలు లేవనెత్తారు. అదే విధంగా ఎస్సీ వర్గీకరణ చట్టం అయ్యే వరకు మరిన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే, వాటిపై కమిషన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కమిషన్ కాలపరిమితిని మరోసారి పెంచింది. మార్చి 10 వరకు పెంచుతూ తెలంగాణ సర్కార్ నేడు ఉత్తర్వులు జారీ చేసింది.