చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళి గత నెల 27వ తేదీన అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జైలులో ఉన్న ఆయనకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ వ్యవహారంలోనే ఆయనపై ఐదు కేసులు నమోదయ్యాయి. అయితే వాటన్నింటికి బెయిల్ మంజూరైనా.. సీఐడీ పీటీ వారెంట్ తో ఆయణ్ను అరెస్టు చేసింది.
ప్రస్తుతం నరసరావుపేట జైలులో ఉన్న ఆయన అనారోగ్య కారణాలతో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గుంటూరు కోర్టు శుక్రవారం రోజున సీఐడీ కేసులో బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలిసింది. ఏపీలో వైఎస్సార్సీపీ సర్కార్ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ లపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురం, నరసరావుపేట, చిత్తూరు, తిరుపతి, కృష్ణ, పశ్చిమగోదావరి, అన్నమయ్య, బాపట్ల జిల్లాల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి.