భాగ్యనగర వాసులకు ఉండే ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్ని కావు. పాపం ఏదైనా చిన్న పని ఉందని బయటకు వచ్చినా సరే గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోయే అవకాశాలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో అది మరింత ఎక్కువైపోయింది కూడా. కొన్ని ప్రాంతాలకే మెట్రో పరిమితం కావడంతో ట్రాఫిక్ కష్టాలు ఇంకా పూర్తిగా తీరలేదు. అయితే ఇప్పుడు మెట్రో శుభవార్త చెప్పింది వాళ్లకు.
కారిడార్-2లోని జేబీఎస్- ఎంజీబీఎస్ లేన్ ఈ రోజు ముఖ్యమంత్రి కెసిఆర్ లాంచనంగా ప్రారంభించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు 11 కిలోమీటర్ల మార్గాన్ని ప్రారంభించనున్నారు. ప్రారంభించిన తర్వాత తన కేబినేట్ సహచరులు… కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డితో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ నేతలతో కలిసి కెసిఆర్ మెట్రో రైలులో ఎంజీబీఎస్ వరకు ప్రయాణిస్తారు.
చిక్కడపల్లి స్టేషన్ లో కాసేపు ఆగుతారు. రూట్‌లో జేబీఎస్-పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, న్యూ గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లు ఉన్నాయి. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ చేరుకునేందుకు కేవలం 16 నిమిషాల సమయం పడుతుంది అంతే. ఈ రూట్ లో గతంలో చిన్న చిన్న వ్యాపారులు ఎక్కువగా ఉండటంతో రోడ్డు విస్తరణకు అడ్డు చెప్పగా ఆ తర్వాత వాటిని జాగ్రత్తగా పరిష్కరించారు. దీనిపై ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.