కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా రాజకీయాల్లోకి రానున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఆయన పాలిటిక్స్ లోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తే కుటుంబ సభ్యుల ఆశీస్సులతో కచ్చితంగా వస్తానని రాబర్ట్ వాద్రా స్పష్టం చేశారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. తనను హస్తం పార్టీ రాజకీయాల్లోకి తీసుకువస్తే విభజన శక్తులతో పోరాడడానికి, దేశాన్ని లౌకికంగా ఉంచడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
“గాంధీ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం వల్ల చాలాసార్లు పలు రాజకీయ పార్టీలు నన్ను పాలిటిక్స్ లోకి లాగేందుకు ట్రై చేశాయి. ఎన్నికల సమయంలో నా పేరు ఉపయోగించాయి. కానీ అవన్నీ ప్రతీకారం కోసమే చేశాయని నేను అర్థం చేసుకున్నాను. నా సతీమణి ప్రియాంకా గాంధీ, బావమరిది రాహుల్ గాంధీ చాలా ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. వాళ్లను చూస్తూ నేను చాలా నేర్చుకున్నాను. నేను ప్రియాంకా పార్లమెంటులో ఉండాలని చాలాసార్లు అనుకున్నాను. ఎట్టకేలకు నా కోరిక తీరింది. పార్టీలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో.. ఎలాంటి మార్పులు అవసరమో నాకు బాగా తెలుసు.” అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్ వాద్రా తెలిపారు.