తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో నవంబర్ 1వ తేదీన నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి ఓటర్లు తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఎన్నికల నోడల్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కరీంనగర్ జిల్లా కమలాపురం పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణ ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది.
రాజకీయ కక్షల కారణంగానే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇక ప్రభుత్వ తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ.. ఆత్మహత్య పేరుతో ఎన్నికల ప్రచార సభలో ఓటర్లను బెదిరించారని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకే నోడల్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.