పాకిస్తాన్‌కి షాకిచ్చిన విదేశీ విమానయాన సంస్థలు

-

పహల్గామ్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు నిర్వహించిన ఘోర దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, భారత్–పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత వాయుసేన ఎప్పుడు ప్రతీకార దాడికి దిగుతుందోనన్న భయంతో పాకిస్తాన్ భారతీయ విమానాల కోసం తన గగనతలాన్ని మూసివేసింది. దీన్ని ప్రతీకార చర్యగా భావించిన భారత్ కూడా తక్షణమే పాకిస్తాన్‌కు చెందిన విమానాలకు తన ఎయిర్‌స్పేస్‌ను మూసివేసింది. ఈ రెండు దేశాల నిర్ణయాలు విమాన ప్రయాణాలపై ప్రభావం చూపుతున్నాయి. ఉత్తర భారతదేశం నుండి మిడిల్ ఈస్ట్, యూరప్, అమెరికాలకు వెళ్లే విమానాలు ఇక పాక్ గగనతలాన్ని దాటకుండా, ముంబై, గుజరాత్ మీదుగా పెద్దచుట్టు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ప్రయాణ సమయం పెరగడం, ఇంధన వ్యయం అధికమవడం ద్వారా ప్రయాణికులకు, విమానయాన సంస్థలకు భారీ భారం ఏర్పడుతోంది.

ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌కు ఇది మరో ఎదురుదెబ్బ. విదేశీ విమానయాన సంస్థలు కూడా పాక్ గగనతలాన్ని స్వచ్ఛందంగా తప్పించుకుంటున్నాయి. లుప్తాన్సా, బ్రిటిష్ ఎయిర్ వేస్, స్విస్, ఎయిర్ ఫ్రాన్స్, ఐటీఏ, LOT వంటి ప్రముఖ యూరోపియన్ కంపెనీలు పాక్ మీదుగా వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నాయి.పాక్ అధికారిక గణాంకాల ప్రకారం, విదేశీ విమానాల ఓవర్‌ఫ్లైట్ ఛార్జీల రూపంలో ప్రతి నెలా మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఈ ఆదాయం పూర్తిగా నష్టంగా మారే అవకాశం ఉంది. 2019 ఫిబ్రవరిలో బాలకోట్ వైమానిక దాడుల అనంతరం, ఇలాంటి గగనతల నిషేధం వల్ల పాకిస్తాన్ ఐదు నెలల్లో కనీసం 100 మిలియన్ డాలర్లను కోల్పోయింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి పునరావృతమవుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news