అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. సభా వేదికపైకి వచ్చిన ప్రధానికి అమరావతి రైతులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. “అమరావతికి నేనున్నాను” అనే సందేశాన్ని ప్రధాని మోదీ ఇచ్చిన సందర్భాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ సందర్భంగా వేదికపై మాట్లాడిన పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు. “ప్రధాని నరేంద్ర మోదీ ఓం సన్యాశాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకు ‘అనికేత్’ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే ఇంటి లేని వాడు, పరమశివుడి పేరులోని తత్త్వం. ఈరోజు ఇల్లు, కుటుంబం లేని మోడీగారు… 140 కోట్ల భారతీయులను తన కుటుంబంగా భావిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు” అని పవన్ అన్నారు.
అదే సమయంలో, అమరావతి రైతులు, ఆడపడుచుల తరపున ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. దేశం కోసం తపించేవారిని, ప్రజల కోసం తమ జీవితాన్ని అంకితం చేసినవారిని గౌరవించాల్సిన అవసరం ఉందని పవన్ తన ప్రసంగంలో హితవు పలికారు.