హైదరాబాద్ అభివృద్ధిలో కీలకమైన ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనుల్లో భూ సేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న అడ్డంకులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల రవాణా సౌలభ్యం కోసం అత్యవసరంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
లక్షలాది ప్రయాణికులకు ఉపయోగపడే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యమవుతున్న నేపథ్యంలో, భూముల సేకరణ పనులు వేగవంతం చేయాలని స్పష్టంగా హెచ్చరించారు. నిర్మాణంలో భాగంగా అంబర్‌పేట్‌లో రూ. 400 కోట్లతో ఫ్లైఓవర్ ఇప్పటికే సిద్ధమైంది. మే 5న రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దీన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కిషన్ రెడ్డి సూచించారు.
ఇటు మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి, అభివృద్ధి అనేది కేవలం హైటెక్ సిటీకి మాత్రమే పరిమితం కాదని, ఓల్డ్ సిటీ, అంబర్పేట్, గౌలిగూడ, సనత్‌నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలోని బస్తీల్లో తాగునీరు, డ్రైనేజీ సమస్యలు నిత్య సమస్యలుగా మారాయని, వీటికి శాశ్వత పరిష్కారం కోసం నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి ప్రాంతంలో వీధిదీపాలు, రోడ్ల మరమ్మతులు వంటి సేవలు తక్షణమే అందుబాటులోకి రావాలని అధికారులను కోరారు. మెట్రో రైలు ప్రాజెక్టును అప్జల్‌గంజ్ వరకే పరిమితం చేయకుండా తదుపరి దశల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కేంద్రానికి తక్షణం పంపించాలని అన్నారు.