పాకిస్తాన్ సైన్యంలో శతఘ్ని గుళ్ల (ఆర్టిలరీ షెల్స్) కొరత అత్యంత ఆందోళనకరంగా మారింది. భారత్‌తో సమర్థవంతంగా యుద్ధం చేయాలంటే కనీసం కొన్ని వారాల నిల్వలు అవసరం అయితే, ప్రస్తుతం ఉన్న నిల్వలు కేవలం నాలుగు రోజులే సరిపోతాయని ఏఎన్ఐ నివేదిక చెబుతోంది. ఇది పాకిస్తాన్ సైనిక రక్షణ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. పాతదైన ఆయుధ ఉత్పత్తి పద్ధతులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోలేకపోవడం, ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున ఆయుధ ఎగుమతుల కారణంగా నిల్వలు తిరిగి నింపలేకపోవడం వంటి అంశాలు దీని వెనుక ప్రధాన కారణాలుగా గుర్తించారు.

పాకిస్తాన్ ఆర్మీకి ముఖ్యమైన 155 mm గోలాలు (M109 హోవిట్జర్), 122 mm రాకెట్లు (BM-21 లాంచర్లు) అందుబాటులో లేవని సమాచారం. ఇదే సమయంలో భారత్‌తో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ, ఈ కొరత సైనిక సన్నద్ధతను బలహీనపరుస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ అంశంపై మే 2న జరిగిన కార్ప్స్ కమాండర్ల సమావేశంలో చర్చ జరిగింది. ఇప్పటికే మాజీ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బాజ్వా కూడా పాకిస్తాన్‌కు దీర్ఘకాల యుద్ధాన్ని తట్టుకునే సామర్థ్యం లేదని గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఆర్థిక సంక్షోభం – రక్షణ రంగంపైనా ప్రభావం
దేశంలో తీవ్ర ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వల లోపం, పెరుగుతున్న అప్పుల నేపథ్యంలో ఆహార సరఫరా తగ్గించడం, సైనిక విన్యాసాల రద్దు, వార్ గేమ్స్ నిలిపివేత వంటి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ పరిస్థితులు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ భద్రతాపరంగా ఎదుర్కొనే సవాళ్లను మరింత పెంచుతాయనేది నిపుణుల అభిప్రాయం.