రాష్ట్రంలో రైతుల దుస్థితిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కనీస మద్దతు ధరలు లభించక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా, అధికార టీడీపీ కూటమి మాత్రం కన్నెత్తి చూడట్లేదంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ వ్యాఖ్యానిస్తూ, “ఒక్క ఎకరాకు ఒక్క క్వింటాల్ పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయని దుస్థితి నెలకొంది. అన్నం పెట్టే రైతులకు ప్రభుత్వం సున్నం రాసింది. ఇదేనా ధర్మం?” అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో రూ. 3 వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధిగా ఖర్చు చేసి, రూ. 7,796 కోట్లతో మార్కెట్ జోక్యం ద్వారా రైతులను ఆదుకున్నట్లు గుర్తు చేశారు.
వైఎస్ జగన్ మరో ముఖ్యాంశాన్ని ప్రస్తావిస్తూ, “ధరల జాబితాలో లేని పొగాకుపై కూడా చరిత్రాత్మకంగా మద్దతు ఇచ్చాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించాల్సింది. అది చేసి ఉంటే రైతులకు ఊరట లభించేది,” అని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రైతులను పట్టించుకోకుండా రాజకీయ డ్రమాలతో మోసం చేస్తోందని ఆరోపించారు.
మిర్చి కొనుగోలు అంశంలోనూ ప్రభుత్వ వైఖరిని జగన్ ఎండగట్టారు. “మిర్చి కొనుగోలు నాఫెడ్ చేస్తుందని చెప్పి, ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా రైతులను నమ్మబలికి మోసం చేశారు. ఒక్క ఎకరాకు సంబంధించి ఒక్క క్వింటాల్ కూడా కొనకుండా చేతులెత్తేశారు. ఇది వాస్తవం కాదా?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పత్తి, మిరప, జొన్న, మినుములు, మొక్కజొన్న, టమాటా, అరటి, పొగాకు వంటి పంటలకు కనీస మద్దతు ధర కూడా లభించని పరిస్థితి భయంకరమని తెలిపారు.