ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల తర్వాత చాలా మంది తీవ్ర విమర్శలు చేసారు. బిజెపి దీనికి సమర్దిస్తుందా లేదా అనేది అర్ధం కాలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ దీనికి ఎంత వరకు సహకరిస్తుందో చెప్పలేని పరిస్థితి. రాజకీయంగా జగన్ బలంగా ఉన్న నేపధ్యంలో రాష్ట్రంలో కూడా ఆ పార్టీ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ ని ఎవరూ కాదు అనే పరిస్థితి మాత్రం ఎక్కడా కనపడటం లేదు.
ఇది పక్కన పెడితే, ఇప్పుడు బిజెపి ముఖ్యమంత్రులు ఇద్దరు… రెండు రాష్ట్రాల్లో మూడు రాజధానుల దిశగా అడుగులు వేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యురప్ప ఈ విషయంలో ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా కీలక అడుగు వేసారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గైర్సేన్ను వేసవి రాజధానిగా ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కీలక ప్రకటన చేసారు.
గైర్సేన్‌లో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేసారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు 280 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గైర్సేన్. ఎప్పటి నుంచో వేసవి రాజధానిగా చెయ్యాలి అనే డిమాండ్లు వినపడుతున్నాయి. ఎట్టకేలకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం వెల్లడించారు. ముఖ్యమంత్రి తాజా నిర్ణయంతో డెహ్రాడూన్ నుంచి పరిపాలన కొనసాగుతుంది. గైర్సేన్‌లో వేసవి రాజధాని ఉంటుంది. ఇప్పటికే నైనిటాల్లో హైకోర్టును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.