తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. గత ఐదు రోజులుగా ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదని పలు విభాగాలకు చెందిన సిబ్బంది ఆరోపిస్తున్నారు. మీడియా పాయింట్ ఐఅండ్‌పీఆర్, సెక్రెటేరియట్ ఎంట్రీ పాసుల జారీ, విదేశాలకు వెళ్లే వారిని ధృవీకరించే విభాగాల్లో ఇంటర్నెట్ కు తీవ్ర అంతరాయం కలగడంతో అధికారులు మాన్యువల్‌గా సచివాలయం పాసులు జారీ చేస్తున్నారు.
అయితే, ఇంటర్నెట్ కేబుల్ వైర్లు తెగిపోవడమే అంతరాయానికి కారణమని తెలుస్తోంది. నెట్ రాకపోవడంతో సిబ్బంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఐటీ విభాగం 5 రోజులుగా మరమ్మతులు చేయడం లేదని, పలుసార్లు ఫిర్యాదు చేసినా జీఏడీ GAD (జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్) అధికారులు పట్టించుకోవడం లేదని సిబ్బంది వాపోతున్నారు.ఏకంగా సచివాలయంలోనే ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.