భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తారా స్థాయికి చేరుకున్నాయి. వరుసగా రెండో రోజు సాయంత్రం పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా దాడికి యత్నించింది. యూరీ, కుప్వారా, పూంచ్, నౌగామ్ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. ఈ చర్యలతో జైసల్మేర్, యూరీలో అలర్ట్ ప్రకటించబడగా, అక్కడ సైరన్లు మోగించబడ్డాయి. భారత భద్రతా దళాలు దాడులకు సమర్థంగా ప్రతిస్పందించాయి. అలాగే, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. సాంబ, జమ్మూ, పఠాన్ కోట్, పోఖ్రాన్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు కనిపించాయి. అయితే భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ తక్షణమే స్పందించి పాక్ డ్రోన్లను కూల్చివేసింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రత దృష్టిలో పెట్టుకొని సరిహద్దు రాష్ట్రాల్లోని 24 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసింది. ఈ నిషేధం ఈ నెల 15వ తేదీ వరకు అమలులో ఉండనుందని ప్రకటించింది. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, కాల్పుల శబ్దాలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయని, ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా బ్లాక్‌ఔట్‌లోకి వెళ్లిందని ఆయన వెల్లడించారు.