పాకిస్థాన్ అంతర్గతంగా ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక సవాళ్లకు తోడు బలూచిస్థాన్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) మంగోచర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించడం కలకలం రేపింది. అంతేగాక, ప్రావిన్స్ అంతటా పలు దాడులు జరిపినట్లు తెలిపింది. ఈ పరిణామాలు అక్కడి భద్రతా పరిస్థితులు ఎంతలా క్షీణించాయో సూచిస్తున్నాయి. బీఎల్‌ఏ ప్రకారం, శనివారం మంగోచర్ పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు పేర్కొంది. దీంట్లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్‌ను కూడా ఆక్రమించామని, కొందరు పోలీసులను బందీలుగా పట్టుకున్నామని పేర్కొంది. తాము 39 ప్రాంతాల్లో మెరుపుదాడులు జరిపామని వెల్లడించింది. ప్రస్తుత ఆపరేషన్ కొనసాగుతోందని, పాకిస్థాన్ సైనిక కాన్వాయ్‌లే తమ లక్ష్యమని హెచ్చరించింది.
తిరుగుబాటుదారులు ప్రధాన రహదారులను కూడా దిగ్బంధించి కదలికలను నియంత్రిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ ఘటనలపై పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదిలా ఉండగా, గత శుక్రవారం జరిగిన మరో దాడిలో 22 మంది పాక్ సైనికులు హతమైనట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. కానీ ఈ విషయాన్ని కూడా పాక్ ప్రభుత్వం ధృవీకరించలేదు. భారత్‌తో ఇప్పటికే ఉద్రిక్తతలు ఉన్న తరుణంలో, దేశంలోనే ఇటువంటి తీవ్ర తిరుగుబాట్లు పాకిస్థాన్ ప్రభుత్వానికి పెద్ద చిక్కుగా మారుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.