మన జీవితాన్ని పరిపూర్ణంగా నిర్మించుకుంటూ, పిల్లల్ని పెంచడం తో మొదలై, రోజువారి బాధ్యతలు నిర్వహిస్తూ చివరికి వృద్ధాప్యంలోకి వచ్చేస్తాం. ఈ వృద్ధాప్యంలో చాలామంది జంటలు కలిసి ఎలా ప్రయాణం చేయాలో సరైన స్పష్టత లేక, వారి జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. చిన్న వయసులో ప్రేమలో పడడం బాగుంటుంది కానీ దశాబ్దాల తర్వాత అదే ప్రేమ నిలబెట్టుకోవాలంటే అది ఎంతో కష్టం. మరి 60 ఏళ్ల తర్వాత ప్రేమ అర్థం మారుతుందా.. 60 ఏళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ కొనసాగాలంటే నిపుణులు చెబుతున్న మార్గాలను మనము తెలుసుకోవాలి మరి అవేంటో చూసేద్దాం..
ఒకరినొకరు అర్థం చేసుకోవడం : జీవితం ఎంతో కష్టపడి వయసు పైబడి 60 కు వచ్చేసిన తర్వాత ఒకరిపై ఒకరు ఇంకా కోపంతో ఒకరినొకరు అర్థం చేసుకోకుండా, గొడవలు పడుతూ ఉంటే ఇక వారు మిగిలిన శేష జీవితాన్ని సంతోషంగా గడపలేరు. అందుకే 60 ఏళ్లు దాటిన తర్వాత అయినా ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరిపట్ల ఒకరు గౌరవంతో స్నేహభావంతో ఉంటే ఆ జీవితం పరిపూర్ణమవుతుందని అంటున్నారు నిపుణులు.
60 సంవత్సరాలు దాటిన తర్వాత చాలామంది జంటలు రిటైర్ అయిపోయి ఖాళీగా ఉన్నాము అని అనుకుంటారు కానీ వారు అప్పుడే వారి జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. ఈ బిజీ జీవితంలో మళ్లీ ఒకరికొకరు ఎన్నో సమస్యలను ఎదురుకోవడానికి సిద్ధపడాలి. ముఖ్యంగా వయసు పైబడిన తరువాత వచ్చే ఆరోగ్య సమస్యలు. వయసు పైబడిన తర్వాత పని లేకుండా ఇంట్లోనే ఉంటారు అది మీకు మరింత ఒత్తిడిని కలిగించవచ్చు ఖాళీగా ఇంట్లో ఉంటున్నాము అనే కోణంలో ఎక్కువ ఆలోచిస్తూ ఒత్తిడికి గురి అవుతారు. దశాబ్దాలుగా జంటలుగా కలిసి గడిపిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు వారి మనసులోని భావాలను పంచుకోవాలి.
ప్రేమ, 60 ఏళ్ల వయసులో : ఈ వయసులో తమ భాగస్వామి పట్ల ప్రేమను చూపించాలి. ఈ వయసులో ఏంటి అని అందరూ అనుకుంటారు కానీ ప్రేమకి వయసు లేదు అనేది మాత్రం గుర్తించాలి. మీరు ఏం కోల్పోతున్నారు ఏమి అవసరమో మిమ్మల్ని ప్రేమించే వారు ఏం కోరుకుంటున్నారు అనేది బహిరంగంగా ఇద్దరు మాట్లాడుకోవాలి. తమ రోజువారి జీవితంలో ఆనందాన్ని పొందడానికి కొత్త పనులను మనమే సృష్టించుకోవాలి. కలిసి నడవడం, కలిసి సినిమా చూడడం, గత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం, కలిసి చిన్న చిన్న ట్రిప్పులకు వెళ్లడం, ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లడం లాంటివి చేయడంతో ఒకరికొకరు ఆనందాన్ని ఆస్వాదించొచ్చు.
శారీరక సాన్నిహిత్యం : వృద్ధాప్యంలో శారీరక సాన్నిహిత్యం మారుతుంది. కానీ ఎప్పటికీ తప్పుగా అర్థం చేసుకునే భావం అయితే కాదు. వృద్ధాప్యంలో శారీరక సాన్నిహిత్యం అంటే శృంగారం మాత్రమే కాదు, హాయిగా ఉండే స్పర్శ,ఆప్యాయత, భావోద్వేగ దగ్గరతనం కూడా ఉంటాయి. భాగస్వామి పట్ల మనకున్న ఆప్యాయతను చూపించవచ్చు. చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం లాంటి చర్యల వల్ల ఒకరికొకరు బంధం బలపరుచుకోవడమే కాక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.
గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఏళ్ళు గడిచేకొద్దీ ఒకరికొకరు తోడుగా జీవితాన్ని గడపాలి. 60 ఏళ్ల తర్వాత ప్రేమను శాశ్వతంగా చివరి వరకు నిలబెట్టుకోవడానికి ఒకరికొకరు సహకారం ఎంతో ముఖ్యం. ఇది వారి జీవితాన్ని ఆనందంగా అర్థవంతంగా మారుస్తుంది.