ఇంట్లో పని మనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు నమోదైన కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) దోషిగా తేలిన సంగతి తెలిసిందే. నేడు ఆయనకు శిక్ష ఖరారు కానుంది. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ బిగ్గరగా ఏడ్చేశాడు. మధ్యాహ్నం 2.45 గంటలకు బెంగళూరులోని ప్రజాప్రతినిధులు ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. ఈక్రమంలో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని మాజీ ఎంపీ వేడుకున్నాడు. ఆ సమయంలో అతడు బిగ్గరగా ఏడ్చాడు. నిన్న తీర్పు ప్రకటించిన వెంటనే కూడా ప్రజ్వల్ కన్నీరుమున్నీరుగా విలపించాడు.
న్యాయస్థానం నుంచి బయటకు వచ్చిన అనంతరమూ వెక్కివెక్కి ఏడ్చాడు. కేఆర్ నగరకు చెందిన మహిళ 2024 ఏప్రిల్ 28న హొళెనరసేపుర ఠాణాలో అత్యాచారం కేసు నమోదు చేసింది. గన్నిగడ ఫాంహౌస్లో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు (47) తన ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజ్వల్పై నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా 14 నెలలుగా ప్రజ్వల్ కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నాడు. రేవణ్ణ ఫోన్ లో దాదాపు 2వేల వీడియోలున్నాయని.. దర్యాప్తు అధికారులు గుర్తించారు.