కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నిర్ణయాలు తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థకు కమిషన్ల కోసమే అప్పజెప్పిందని ఆరోపించారు. దీని కోసం రూ. 1 లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, మరియు సుందిళ్ల బ్యారేజీలలో నిర్మాణ లోపాలు, పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, నిర్లక్ష్యం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 15 నెలల పాటు 119 మందిని విచారణ జరిపి.. ఆగస్టు 1న 650 పేజీలతో కూడిన మూడు వాల్యూమ్ల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో బ్యారేజీల నిర్మాణంలో శాస్త్రీయ పరీక్షలు జరపకపోవడం, మంత్రివర్గ ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, బీఆర్ఎస్ నాయకులైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కీలక పాత్రలు పోషించినట్లు ఆరోపించింది.