ఒలింపిక్ బాక్సింగ్ ఈవెంట్ లో ఇక పై లింగ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. గతంలో పురుషుల స్థాయి హార్మోన్లతో ఉన్న మహిళా బాక్సర్లు పోటీలకు దిగినప్పుడు విమర్శలు వచ్చాయి. ఇకపై ఇలాంటి విమర్శలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో మహిళా ఈవెంట్లలో పోటీ పడే ప్రతీ ఒక్కరికీ పరీక్షలు తప్పనిసరి చేశారు. ఇందులో భాగంగా వచ్చే నెలలో జరిగే ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పాల్గొనే బాక్సర్లకు లింగనిర్ధారణ పరీక్షలు చేయనున్నట్టు ప్రపంచ బాక్సింగ్ అధ్యక్షుడు బోరిస్ వాన్ డిర్ వోర్స్ వెల్లడించారు.
“సమాఖ్య అందరిపట్ల హుందాగా వ్యవహరిస్తుంది. వ్యక్తుల వ్యక్తిత్వాన్ని గౌరవిస్తుంది” అని బోరిస్ పేర్కొన్నారు. బాక్సింగ్ లాంటి పోరాట క్రీడలో భద్రత, పోటీతత్వం సమన్యాయం ను పాటించాల్సి ఉంటుందని.. మరింత జవాబుదారితనం, పారదర్శకతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. జీవసంబంధ లింగసూచిక అయిన వై క్రోమోజోమ్ జన్యువుల ఉనికినీ ఈ పరీక్షలో నిర్దారిస్తారు. ఇంగ్లాండ్ లోని లివర్ పూల్ లో సెప్టెంబర్ లో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరుగనున్నాయి.