పెళ్లి అనేది నూరేళ్ల బంధం భార్యాభర్త ఇద్దరు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని మన పెద్దలు దీవిస్తారు. కానీ ఈ రోజుల్లో ఆ బంధం కొన్ని నెలలు లేదా సంవత్సరాలకి తెగిపోవడం చూస్తున్నాం. ఈరోజుల్లో ఎక్కువ మంది విడాకులు తీసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ ఆ కారణాలు చాలా చిన్నవిగా, సమస్య పరిష్కరించుకునే విధంగా ఉన్న, విడాకుల వరకు జంటలు వెళుతున్నాయి. అయితే ఈ సమస్యకు పరిష్కారం భగవద్గీతలో వెతుక్కోవచ్చా? ఈ ఆధునిక జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలకు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలో ఏమైనా పరిష్కారం ఉందా? ఈ తరం వారికి అవసరమైన కొన్ని కీలకమైన నిజాలు గీత ఎలా వివరిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
భగవద్గీత అనేది కేవలం ఒక మత గ్రంథం కాదు. అది జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప గైడ్. మన సంబంధాలను ముఖ్యంగా పెళ్లి సంబంధాన్ని ఎలా కాపాడుకోవాలో గీత చాలా స్పష్టంగా చెబుతుంది.
అహంకారం కోపం వదిలేయడం : గీతలో శ్రీకృష్ణుడు క్రోదం అనేది అన్నిటికీ మూలం అది మన వివేకాన్ని నాశనం చేస్తుందని చెబుతాడు. పెళ్లి బంధంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపం అహంకారం ఎక్కువగా ప్రదర్శించడం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి. అహంకారం మనసును అంధకారం చేస్తుంది. ఎదుటివారిని బాధను అర్థం చేసుకోకుండా ప్రవర్తించేలా చేస్తుంది. గీత చెప్పిన ప్రకారం అహంకారం వదిలిపెట్టి ప్రేమ సహనంతో మాట్లాడితే సంబంధాలు బలపడతాయి.
కర్మ సిద్ధాంతం అర్థం చేసుకోవడం: లాభపేక్ష లేకుండా కర్మ చేయాలి అని శ్రీకృష్ణుడు గీత లో అర్జునుడికి చెబుతాడు. పెళ్లి బంధం లో కూడా ఇదే వర్తిస్తుంది కేవలం లాభక్షతో ఏదో ఆశించి సంబంధం లో ఉంటే నిరాశ మిగులుతుంది. అవతలి వారి నుంచి ఏదో ఆశించడం మానేసి మన బాధ్యతలను ప్రేమగా ఉండడం, గౌరవించడం లాంటి వాటిని మనం సక్రమంగా నిర్వర్తించాలి. అప్పుడే ఆ సంబంధం శాశ్వతంగా ఉంటుంది.

నిత్యం నేర్చుకోవడం: జ్ఞానం అనేది నిరంతర ప్రక్రియ అని గీత చెబుతుంది. పెళ్లిలో కూడా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడం నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యం. కాలం మారినప్పుడు ఒకరి అభిప్రాయాలు మారినప్పుడు దానికి అనుగుణంగా మరొక వ్యక్తి మారాలి. అలా మారగలిగే ఓపిక ఉండాలి ఒకరిపై ఒకరు గౌరవం పెంచుకుంటూ, ఒకరినొకరు కొత్తగా తెలుసుకుంటూ, ఉంటే బంధం ఎప్పటికీ ఫ్రెష్ గా ఉంటుంది.
సహనం, క్షమించే గుణం: శ్రీకృష్ణుడు సహనం ప్రాముఖ్యత గురించి గీత లో చెబుతాడు. పెళ్లి అయిన తరువాత చిన్న చిన్న తప్పులు సహజం, వాటిని భూతద్దంలో పెట్టి చూడకుండా క్షమించే గుణం ఉండాలి. అతడు లేక ఆమె మారాలి అని అనుకోకుండా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అప్పుడే బంధం బలంగా నిలబడుతుంది.
గీత చెప్పిన ఈ సూత్రాలు కేవలం పెళ్ళికే కాదు అన్నీ మానవ సంబంధాలకు వర్తిస్తాయి. ఈ నియమాలను మన జీవితంలో పాటించగలిగితే పెళ్లి బంధం ఒక కొత్త అర్ధాన్ని సంతరించుకుంటుంది.