మన ఆహారంలో ఉప్పుకి ఉండే ప్రాముఖ్యత వేరు. కాస్త ఉప్పు తగ్గిన ఏ కూరని మనం తినలేము. అన్నంలో ఉప్పు తక్కువైతే చేతిలోకి తీసుకొని వేసుకోవడం మనలో చాలామందికి అలవాటు. ఒకరి చేతిలో నుంచి ఇంకో చేతిలోకి ఉప్పు తీసుకోవడం శుభం కాదని, దురదృష్టమని తగాదాలు కలుగుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు. మరి నిజంగానే ఉప్పు చేతిలోకి తీసుకోకూడదా? దీని వెనుక ఉన్న కారణాలు శాస్త్రీయ సాంప్రదాయ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉందా? అయితే ఉప్పుని చేతిలోకి తీసుకోకూడదని మన పెద్దలు ఎందుకంటారు దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అపోహలు,నిజాలు :ఉప్పును చేతిలోకి తీసుకోవడం లేదా మరొకరికి నేరుగా చేతితో ఇవ్వడం మన సంస్కృతిలో అశుభంగా పరిగణిస్తారు. ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు అన్నంలో ఉప్పు తక్కువైతే చాలామంది వేరే వారి చేతిలో నుంచి ఉప్పు తీసుకొని కలుపుకుంటారు. దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని ధనం చేతిలో నుంచి జారిపోతుందని నమ్ముతారు. ఉప్పు అనేది ధనానికి శ్రేయస్సుకి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఉప్పును అగౌరపరచడం అంటే ధనాన్ని అగౌరపరచడమే అని చెబుతారు. అలా చేతిలోకి తీసుకోవడం వల్ల ఒకరిపై ఒకరికి తగాదాలు కలుగుతాయని అంటారు కానీ అది ఎంతవరకి నిజమనేది ఎక్కడ నిరూపణ అవలేదు అపోహ మాత్రమే.

దీని వెనుక ఉన్న సైన్స్: మనం ఉప్పును నేరుగా చేతిలోకి తీసుకున్నప్పుడు మన చేతిలో ఉన్న సూక్ష్మ క్రిములు ఉప్పుకు అంటుకొని అది మనం తినే ఆహారంలోకి వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే చేతిలో ఉన్న తేమ కారణంగా ఉప్పు గట్టిపడి కరిగిపోతుంది. అందుకే పరిశుభ్రత ఆరోగ్యం దృశ్య కూడా ఉప్పును ఒక స్పూన్ తో తీసుకోవడం మంచిది. మన సాంప్రదాయాలు చాలావరకు ఆరోగ్య నియమాలతో ముడిపడి ఉంటాయని దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు.
ఉప్పును చేతిలోకి తీసుకోవడం అశుభమని దీనివల్ల లక్ష్మీదేవి కోపం వస్తుందని కొందరు నమ్ముతారు. ఈ నమ్మకం వెనుక ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఉన్నాయి. ఉప్పు నేరుగా చేతిలో కాకుండా స్పూన్ తో చిన్న గిన్నెలో తీసుకొని వాడుకోవడం వల్ల ఆరోగ్యం, సంప్రదాయం రెండు కాపాడబడతాయి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం సాంప్రదాయ, శాస్త్రీయ నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత నమ్మకాలు అలవాట్లు వేరువేరుగా ఉండవచ్చు.