తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో నేడు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, సిద్దిపేట, భద్రాద్రి, నిజామాబాద్, ఖమ్మం, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

అటు ఏపీలోనూ ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు కొన్ని ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు. కాగా ఏపీ ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప వర్షం కురిసే సమయంలో బయటకి వెళ్లకూడదని తెలిపారు. వర్షం కురుస్తున్న సమయంలో బయట చెట్ల కింద ఉండకూడదని స్పష్టం చేశారు. నేటి నుంచి మరో రెండో రోజులపాటు తెలుగు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.