మనం అలవాటుగా వాడే మొబైల్ ఫోన్ ఇప్పుడు ఒక వ్యసనంగా మారిపోయింది. ఏ పని చేస్తున్నా ఏ క్షణంలోనైనా, మన చేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఈ వ్యసనం ఎంతలా పెరిగింది అంటే వాష్ రూమ్ కి వెళ్లినా కూడా ఫోన్ వెంట తీసుకెళ్తున్నాం. ఈ అలవాటు చాలామందికి సాధారణమైన విషయంలో అనిపించవచ్చు. కానీ దీని వల్ల మన ఆరోగ్యానికి, వ్యక్తిగత శుభ్రతకు చాలా ప్రమాదం ఉందని మీకు తెలుసా? ఈ అలవాటు వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు గురించి వివరంగా తెలుసుకుందాం.
అంటువ్యాధులు వ్యాప్తి : వాష్ రూమ్ లో అనేక రకాల బ్యాక్టీరియా వైరస్ లు వుంటాయి. టాయిలెట్ ఫ్రెష్ చేసినప్పుడు ఈ క్రిములు గాలిలో వ్యాప్తిస్తాయి. మన ఫోన్ పై ఈ క్రిములు చేరి అవి చేతుల ద్వారా మన ముఖానికి నోటికి చేరుతాయి. దీనివల్ల టైఫాయిడ్, సాల్మొనెల్ల వంటి అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది. వాష్ రూమ్ లో వాడిన ఫోను బయట పెట్టడం వల్ల పిల్లలు తెలియక వెంటనే పట్టుకుంటారు దీని వల్ల వారికి కూడా ఈ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.
పైల్స్ సమస్య : చాలామంది వాష్ రూమ్ లో ఫోన్ చూస్తూ ఎక్కువ సమయం కూర్చుంటారు. దీని వల్ల మలవిసర్జన చేసే ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పురీషనాళం (rectum) మీద ఒత్తిడి పెరిగి ఫైల్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇక ఇప్పటికే పైల్స్ ఉన్నవారు ఇలా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ప్రమాదం మరింత పెరగవచ్చు.

సమయం వృధా: చాలామంది ఒక పని చేయాలంటే నా దగ్గర సమయం లేదని ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాష్ రూమ్ లో ఎక్కువసేపు ఫోన్ చూడడం మాత్రం మానుకోరు. దీనివల్ల సమయం ఎంత వృధా అవుతుందన్నది ఆలోచించాలి. వాష్ రూమ్లో ఎక్కువసేపు ఫోన్ వాడడం వల్ల మన రోజువారి పనులకు ఆటంకం ఏర్పడుతుంది. ఇది సమయాన్ని వృధా చేయడమే కాకుండా పనిలో ఏకాగ్రతను కూడా తగ్గిస్తుంది.
మానసిక సమస్యలు: నిరంతరం ఫోన్ కు అతుక్కుపోవడం ఒక రకమైన మొబైల్ వ్యసనం కిందకే వస్తుంది. ఇది మనల్ని సమాజం నుంచి దూరం చేస్తుంది. దీని వల్ల ఆందోళన ఒత్తిడి వంటి మానసిక సమస్యలు పెరుగుతాయి.
శుభ్రత లోపం: ఫోన్ పట్టుకొని ఉన్నప్పుడు చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోలేరు. కేవలం నీటితో కడుక్కుంటే సరిపోదు సబ్బు లేదా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవడం తప్పనిసరి.
వాష్ రూమ్ లో మొబైల్ వాడకం వల్ల అంటి వ్యాధులు పైల్స్ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇది సమయం వృధా చేయడమే కాక మొబైల్ వ్యసనానికి దారితీస్తుంది. ఈ అలవాటు మానుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యం అన్నిటికంటే విలువైనది. వాష్ రూమ్ లో ఫోన్ వాడకాన్ని పూర్తిగా మానేసి, మన శారీరక, మానసిక ఆరోగ్యాలను కాక మన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..