తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి బతుకమ్మ సంబరాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సాధారణంగా ప్రతి ఇంట్లో స్త్రీలు బతుకమ్మను తయారు చేసి వీధులలో పెట్టి సంతోషంతో ఆడుతూ పాడుతూ సంబరాలు జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు తీరోక్క బతుకమ్మను తయారు చేసి రకరకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు. ఇక ప్రతి చోట్ల అశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు.

కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కేవలం వేములవాడలో మాత్రమే ఏడు రోజుల పాటు బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు. ఇక్కడ ఏడో రోజు అయిన వేపకాయల బతుకమ్మను సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. కాగా, ఇక్కడి ఆడపడుచులు పుట్టింటితో పాటు వారి మెట్టినింట్లో కూడా బతుకమ్మను ఆడడం ఎంతో అదృష్టంగా భావిస్తారు. అయితే వేములవాడలో మాత్రమే పూర్వకాలం నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. యధావిధిగా దసరా పండుగను ప్రతి ప్రాంతాలలో ఎలా జరుపుకుంటారో వేములవాడ ప్రజలు కూడా అలానే దసరా పండుగను జరుపుకుంటారు.