పిల్లలు తరచుగా గురక పెడితే నిర్లక్ష్యం చేయొద్దు..ఎడినాయిడ్స్ లక్షణాలు ఇవే

-

మీ చిన్నారి నిద్రిస్తున్నప్పుడు పదే పదే గురక పెడుతున్నారా? పగటి పూట నోరు తెరిచి గాలి పీల్చుకుంటున్నారా? అయితే దాన్ని మామూలు అలసటగా భావించి నిర్లక్ష్యం చేయకండి. పిల్లల్లో గురక వెనుక ఉన్న ముఖ్య కారణాలలో ఒకటి ఎడినాయిడ్స్ (Adenoids) సమస్య. ముక్కు వెనుక భాగంలో ఉండే ఈ చిన్న కణజాలం పెరగడం వల్ల శ్వాస మార్గానికి అడ్డంకి ఏర్పడి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఈ ఎడినాయిడ్స్ అంటే ఏమిటి వాటి లక్షణాలు మరియు వాటిని ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదో తెలుసుకుందాం.

పిల్లల్లో తరచుగా గురక: ఎడినాయిడ్స్ అనేవి ముక్కు వెనుక భాగంలో గొంతు పైభాగంలో (నాసోఫారింక్స్‌లో) ఉండే చిన్న శోషరస గ్రంథుల సమూహం. ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థలో భాగంగా పనిచేస్తాయి. చిన్న వయస్సులో ఇవి బాగా చురుకుగా ఉంటాయి. కానీ తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్లు లేదా అలర్జీల కారణంగా ఈ ఎడినాయిడ్స్ వాపుకు గురై సాధారణ పరిమాణం కంటే బాగా పెరిగిపోతాయి. దీనినే వైద్య పరిభాషలో ఎడినాయిడల్ హైపర్‌ట్రోఫీ అంటారు.

ఎడినాయిడ్స్ ముఖ్య లక్షణాలు: గురక (Snoring) మరియు శ్వాసలో ఇబ్బంది ఇది ప్రధాన లక్షణం. నిద్రలో శ్వాస మార్గానికి అడ్డంకి ఏర్పడటం వల్ల పిల్లలు పెద్ద శబ్దంతో గురక పెడతారు. కొందరిలో శ్వాస ఆగి మళ్లీ ప్రారంభం కావచ్చు (స్లీప్ అప్నియా).

Adenoid Symptoms in Kids: What Parents Should Know
Adenoid Symptoms in Kids: What Parents Should Know

నోటి ద్వారా శ్వాస తీసుకోవడం : ముక్కు మార్గం మూసుకుపోవడం వల్ల పిల్లలు తరచుగా నోటిని తెరిచి గాలి పీల్చుకుంటారు. ఇది పగటిపూట కూడా కనిపిస్తుంది. దీనివల్ల నోరు, గొంతు పొడిబారడం జరుగుతుంది.

నిద్రలో ఆటంకాలు: తరచుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వల్ల పిల్లలు సరిగా నిద్రపోలేరు. దీంతో పగటిపూట అలసట, చిరాకు లేదా చదువుపై ఏకాగ్రత కోల్పోవడం జరుగుతుంది.

చెవి సమస్యలు: ఎడినాయిడ్స్ వాపు యూస్టేషియన్ ట్యూబ్‌ను (Eustachian Tube) నిరోధించడం ద్వారా చెవి ఇన్ఫెక్షన్లు తరచుగా రావడం లేదా వినికిడి లోపం సంభవించడం జరుగుతుంది.

మాట్లాడే విధానంలో మార్పు: ముక్కు మూసుకుపోవడం వల్ల వచ్చే ముక్కు దిబ్బడ తరచుగా ఉండటం వల్ల మాటల్లో గొంతు మార్పు కనిపిస్తుంది.

పిల్లల్లో గురక సమస్యను నోటితో శ్వాస తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేయడం వలన దీర్ఘకాలిక సమస్యలు రావచ్చు. నిద్ర సరిగా లేకపోవడం వల్ల శారీరక, మానసిక ఎదుగుదల మందగించవచ్చు. దీనికి సరైన సమయంలో వైద్యులను సంప్రదించి అవసరమైతే చికిత్స అందించడం ద్వారా పిల్లల శ్వాస, నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

పిల్లలు గురక పెడుతున్నప్పుడు అది సాధారణ విషయం కాదని అది ఎడినాయిడ్స్ పెరగడం వల్ల వచ్చిన సమస్య కావొచ్చని తల్లిదండ్రులు గుర్తించాలి. సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం, పిల్లలు సుఖంగా నిద్రపోవడానికి ఆరోగ్యంగా ఎదగడానికి చాలా ముఖ్యం. గురకను నిర్లక్ష్యం చేయకుండా చర్యలు తీసుకోవడం ద్వారా మీ బిడ్డ ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేయవచ్చు.

గమనిక: ఈ లక్షణాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. సరైన నిర్ధారణ మరియు చికిత్స కోసం తప్పనిసరిగా ENT (చెవి, ముక్కు, గొంతు) నిపుణుడిని సంప్రదించాలి.

Read more RELATED
Recommended to you

Latest news