హైకోర్టు తీర్పు మేరకు రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలోని ఆదిత్య కేడియా రియాల్టర్స్ సంస్థ ప్రాజెక్టుకు అనుమతులను మళ్లీ పునరుద్ధరించినట్లు హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టులో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని కూడా తెలిపింది. ఆ వివరాలు చూస్తే ..
2022లో హెచ్ఎండీఏ, మంచిరేవుల గ్రామంలో 9.19 ఎకరాల విస్తీర్ణంలో 38 అంతస్తుల బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. అయితే, 2023లో జరిగిన సంయుక్త తనిఖీలలో ఆ సంస్థ మూసీ నది బఫర్ జోన్‌లో రిటైనింగ్ వాల్ నిర్మించిందని తేలడంతో, హెచ్ఎండీఏ అనుమతులను రద్దు చేసింది. అదే సమయంలో రిటైనింగ్ వాల్ తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.

ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆదిత్య సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు మళ్లీ జాయింట్ ఇన్‌స్పెక్షన్ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 2024 ఫిబ్రవరి 26న జరిగిన ఆ తనిఖీలో సంస్థ రిటైనింగ్ వాల్‌ను తొలగించినట్లు తేలింది. దీని ఆధారంగా హైకోర్టు 2024 మార్చి 1న అనుమతులను పునరుద్ధరించాలని తీర్పు ఇచ్చింది. దాంతో హెచ్ఎండీఏ 2024 జూన్ 20న ఆ ప్రాజెక్టు అనుమతులను అధికారికంగా పునరుద్ధరించింది.
2022 మే 12న ఆదిత్య సంస్థ, రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామం (సర్వే నంబర్లు 476/AA1, 476/AA2)లో 9.19 ఎకరాల విస్తీర్ణంలో 38 అంతస్తుల బహుళ అంతస్తుల భవనం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని హెచ్ఎండీఏకి దరఖాస్తు చేసింది.
అయితే ప్రతిపాదిత స్థలం మూసీ నది సమీపంలో ఉండటంతో, దీనిపై వివరణ కోరింది హెచ్ఎండీఏ. ఆ సందర్భంలోనే సంస్థ ఇప్పటికే 2021 అక్టోబర్ 8న ఇరిగేషన్ శాఖ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నుంచి ఎన్వోసీలు పొందినట్లు సమర్పించింది.
ఆదిత్య సంస్థ ప్రతిపాదనలను హెచ్ఎండీఏలోని మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ (MSB) కమిటీ పరిశీలించింది. అనుమతుల మంజూరుకు ముందు, నిర్దేశిత ఫీజు చెల్లించాల్సిందిగా సూచించింది. సంబంధిత రుసుము చెల్లించిన తర్వాత, 2022 ఆగస్టు 19న భవన నిర్మాణ అనుమతిని అధికారికంగా జారీ చేసింది.