ప్రతి స్త్రీ తమ జీవితంలో ఎదుర్కొనే సాధారణ సమస్యల్లో తెల్ల బట్ట (వైట్ డిశ్చార్జ్, లూకోరియా) ఒకటి. ముఖ్యంగా పీరియడ్స్ (రుతుస్రావం) వచ్చే ముందు లేదా ఆ సమయంలో ఈ సమస్య కొందరికి ఎక్కువ అవుతుంది. ఇది పూర్తిగా సహజమే అయినా కొందరికి అసౌకర్యాన్ని, ఇబ్బందిని కలిగిస్తుంది. అయితే కొన్ని సింపుల్ ఇంటి చిట్కాలు జీవనశైలి మార్పుల ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. మీ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఆ చిన్న జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం.
తెల్ల బట్ట (వైట్ డిశ్చార్జ్) అనేది సాధారణంగా హార్మోన్ల మార్పుల వల్ల వస్తుంది. అయితే పరిశుభ్రత (హైజీన్) పాటించకపోవడం లేదా కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల ఇది పెరిగే అవకాశం ఉంది. ఈ సమస్య తగ్గడానికి కొన్ని చిట్కాలు తెలుసుకోవటం ముఖ్యం.
పరిశుభ్రత ముఖ్యం: మీ యోని ప్రాంతాన్ని ఎల్లప్పుడూ పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. సువాసన ఉన్న సబ్బులు లేదా వాష్లను వాడకుండా, కేవలం గోరువెచ్చని నీటితో కడగడం ఉత్తమం. బహిరంగ ప్రదేశాల్లో టాయిలెట్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోదుస్తులను రోజుకు రెండుసార్లు మార్చడం మంచిది.

పత్తి లోదుస్తులు : సింథటిక్ లేదా నైలాన్ లోదుస్తులకు బదులుగా, పత్తి (కాటన్) లోదుస్తులను వాడండి. పత్తి గాలి తగిలేలా చేసి, తేమను తగ్గించి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
నీరు పుష్కలంగా తాగాలి: డీహైడ్రేషన్ (నిర్జలీకరణం) సమస్యను పెంచుతుంది. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరం నుంచి విషపదార్థాలు బయటకు వెళ్లి, పీహెచ్ స్థాయి, సమతుల్యంగా ఉంటుంది.
మెంతులు : రాత్రిపూట కొద్దిగా మెంతులను నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగడం లేదా ఉడికించిన మెంతి ఆకుల రసాన్ని తాగడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది, ఇది తెల్ల బట్ట సమస్యను తగ్గిస్తుంది.
ఆరోగ్యకరమైన ఆహారం: పుల్లటి పెరుగు లేదా మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్ తీసుకుంటే, శరీరంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో సహాయపడుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, మసాలాలు తగ్గించడం ఉత్తమం.
తెల్ల బట్ట అనేది తరచుగా కనిపించే సమస్యే అయినా కొన్ని చిన్న చిన్న జీవనశైలి మార్పులతో దాన్ని నియంత్రించవచ్చు. మీ ఆరోగ్యం, పరిశుభ్రత పట్ల శ్రద్ధ వహించడం ద్వారా ఈ అసౌకర్యం నుంచి ఉపశమనం పొందవచ్చు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, ఏదయినా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.