తోడబుట్టినవారి ప్రేమకు,అనురాగానికి ఒక రోజు కేటాయిస్తే అది రాఖి అంటాము కానీ వారి అనుబంధానికి మరోసారి పట్టాభిషేకం జరగనుంది అది రేపు (23 అక్టోబర్) కేవలం ఆచారంగా కాకుండా హృదయాల లోతుల్లో దాగివున్న అన్నచెల్లెళ్ల అపురూపమైన ప్రేమను, అనురాగాన్ని ‘భగిని హస్త భోజనం’ పండుగ రూపంలో ఆస్వాదించే సందర్భం ఇది. ప్రతి ఇంటిలోనూ నవ్వులు, రుచికరమైన వంటకాల సువాసనలు, ఆప్యాయతతో కూడిన మాటలు ఈ పండుగ ప్రత్యేకత. ఒక చెల్లెలు తన అన్నకు లేదా అన్న తన చెల్లెలికి ప్రేమగా వడ్డించే ఈ భోజనం వెనుక తరగని ఆప్యాయత, క్షేమం కోరే అద్భుతమైన భావోద్వేగం దాగివుంది.
పురాణ కథ : యమునాదేవి తన అన్నను ఉద్దేశించి “అన్నా ఈ కార్తీక శుద్ధ విదియ రోజున లోకంలో ఎక్కడైనా సరే, ఏ సోదరుడైతే తన చెల్లెలు లేదా అక్క ఇంటికి వెళ్లి ఆమె చేతి వంటతో భోజనం చేస్తాడో వారికి అకాల మరణం (అపమృత్యు దోషం) లేకుండా దీర్ఘాయుష్షు లభించేలా అనుగ్రహించు. అలాగే ఆ సోదరుడికి ప్రేమగా భోజనం వడ్డించిన సోదరి సౌభాగ్యవతిగా ఉండేలా దీవించు” అని కోరింది.
చెల్లెలి నిస్వార్థమైన కోరికకు యముడు ఎంతో సంతోషించి తథాస్తు అని వరం ప్రసాదించాడు. ఆ రోజు నుండి ఈ పండుగను ‘యమ ద్వితీయ’ లేదా ‘భగిని హస్త భోజనం’ గా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. సోదరుల క్షేమాన్ని, సౌభాగ్యాన్ని కోరుకునే ఈ పండుగ, పురాణాల నుంచి నేటి తరాల వరకు అన్నచెల్లెళ్ల బంధంలోని పవిత్రతను, అనురాగాన్ని నిలిపి ఉంచుతుంది.

చెల్లెలి చేతి వంట – క్షేమమనే కానుక: భగిని హస్త భోజనం (లేదా భాయ్ దూజ్) కేవలం అన్నం పెట్టడం కాదు; ఇది ప్రేమపూర్వకమైన రక్షణ, ఆశీర్వాదం అందించే ఓ వేడుక. జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా ఈ అన్నచెల్లెళ్ల అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే. చెల్లెలు తన అన్నకు ఇష్టమైన వంటకాలతో భోజనం వడ్డించి, ఆశీర్వదించి అతని దీర్ఘాయుష్షు, శ్రేయస్సు కోసం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. పితృస్వామ్య సమాజంలో చెల్లెలి క్షేమాన్ని కోరే బాధ్యత అన్నపై ఉంటుందనే భావన ఉన్నా, ఈ పండుగలో మాత్రం అన్న క్షేమాన్ని కోరే పాత్ర చెల్లెలిది. చిన్ననాటి అల్లరి, గొడవలు, అనుబంధాలు ఒకసారిగా గుర్తుకొచ్చి, ఈ పండుగ వారి బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
అనుబంధమే అసలైన పండుగ: మారిన కాలంతో పాటు పండుగల జరుపుకునే విధానాలు మారుతున్నా భగిని హస్త భోజనం యొక్క అంతర్గత సందేశం మాత్రం సజీవంగానే ఉంది. ఎన్ని మైళ్లు దూరంగా ఉన్నా ఉద్యోగాల వల్ల ఎంత బిజీగా ఉన్నా ఈ రోజున ఎలాగైనా ఒక్కటై, కలిసి భోజనం చేయాలనే తపన ఈ బంధంలోని పవిత్రతను తెలియజేస్తుంది. ఈ ప్రత్యేక భోజనం ముగింపులో అన్న తన చెల్లెలికి బహుమతి ఇచ్చి, ఆమె పట్ల తన ప్రేమ, బాధ్యతను చాటుకుంటాడు. ఈ ఆచారమంతా కేవలం ఒక రోజు వేడుకగా కాకుండా నిత్యం నిలిచే అనుబంధానికి గుర్తుగా నిలుస్తుంది.