చలికాలం అంటే పడుకోవడానికి వెచ్చగా, హాయిగా ఉంటుంది అనుకుంటాం. కానీ చాలా మందికి ఈ సీజన్లోనే నిద్ర పట్టకపోవడం (ఇన్సోమ్నియా) లేదా విచిత్రమైన కలలతో నిద్రకు భంగం కలగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వాతావరణంలో వచ్చే మార్పులు మన నిద్ర చక్రంపై ఎలా ప్రభావం చూపి మన ప్రశాంతతను దెబ్బతీస్తాయో తెలుసుకుంటే ఈ చలికాలం మీ స్లీప్కు ‘వింటర్ వండర్ల్యాండ్’ అవుతుంది..మరి తెలుసుకుందాం..
చలికాలంలో నిద్రలేమి (ఇన్సోమ్నియా) ఎందుకు: చలికాలంలో నిద్ర సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం సూర్యరశ్మి తక్కువగా ఉండటమే. పగటి సమయం తగ్గడం వలన, మన శరీరంలో నిద్రను ప్రేరేపించే ‘మెలటోనిన్’ అనే హార్మోన్ ఉత్పత్తి ఎక్కువసేపు జరుగుతుంది. దీనివల్ల పగటిపూట సోమరితనం, బద్ధకం పెరిగి, రాత్రిపూట నిద్ర నాణ్యత తగ్గిపోతుంది. అలాగే చల్లని వాతావరణంలో వెచ్చదనం కోసం శారీరక శ్రమ తగ్గించి, ఇంట్లోనే ఎక్కువసేపు టీవీలు, మొబైల్స్ చూడటం వల్ల కూడా నిద్ర సమయం దెబ్బతింటుంది. పడుకునే గది ఉష్ణోగ్రత సరైన విధంగా లేకపోవడం కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.

ఎక్కువ కలలు, విచిత్రమైన స్వప్నాలు:చలికాలంలో కలలు ఎక్కువగా, స్పష్టంగా రావడానికి కూడా పగటి వెలుతురు తక్కువగా ఉండటమే కారణం. ఎక్కువసేపు మెలటోనిన్ విడుదల వల్ల, మనం ఎక్కువసేపు ‘REM’ (Rapid Eye Movement) స్లీప్లో ఉంటాం. ఈ REM దశలోనే మెదడు చురుకుగా పనిచేస్తూ కలలు వస్తాయి. అంతేకాక చలికి ముడుచుకుని పడుకోవడం లేదా దుప్పటి ఎక్కువ కప్పుకోవడం వలన శరీరానికి అసౌకర్యం, ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఏర్పడి కూడా కలత నిద్ర, పీడకలలు వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి లేదా విటమిన్ డి లోపం కూడా ఈ సమస్యను పెంచుతుంది.
చలికాలంలో నాణ్యమైన నిద్ర పొందాలంటే, నిద్ర వేళలను స్థిరంగా పాటించడం చాలా ముఖ్యం. వీలైనంత వరకు పగటిపూట సూర్యరశ్మికి గురికావడానికి ప్రయత్నించండి. పడుకునే ముందు గోరువెచ్చని పాలు లేదా హెర్బల్ టీ తాగడం, పడకగదిని ప్రశాంతంగా, సరైన ఉష్ణోగ్రతలో ఉంచుకోవడం వంటి చిన్న మార్పులు మీ నిద్ర సమస్యలను దూరం చేయగలవు. హాయిగా నిద్రపోండి, ఆరోగ్యంగా ఉండండి.
గమనిక: ఈ చిట్కాలు సాధారణ అవగాహన కోసం మాత్రమే. మీకు దీర్ఘకాలికంగా నిద్రలేమి లేదా పీడకలల సమస్యలు ఉంటే, వెంటనే నిపుణులైన వైద్యుడిని లేదా స్లీప్ థెరపిస్ట్ను సంప్రదించడం ఉత్తమం.
