ఒక చిన్న నల్లటి రాయిలో శ్రీమహావిష్ణువు స్వయంగా నివసించడం ఒక దివ్య రహస్యం. నేపాల్లోని గండకీ నదిలో మాత్రమే లభించే ఈ సాలగ్రామ శిల మన పూజా మందిరాలకుఎంతో పవిత్రతను తెస్తుంది. అసలు విష్ణుమూర్తి శిల రూపాన్ని ఎందుకు ధరించారు? యుగయుగాలుగా ఈ శిల ఎలా పూజలందుకుంటోంది? ఈ అద్భుతమైన దివ్య రహస్యాన్ని తెలుసుకుందామా..
దివ్య రహస్యం: విష్ణువు శిల రూపం ధరించడానికి కారణం, సాలగ్రామ శిల సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించబడుతుంది. దీని వెనుక ఒక పురాణ కథ ఉంది. దేవీ భాగవతం ప్రకారం, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసీ దేవి (బృంద) శాపం కారణంగా ఆయన శిల రూపం ధరించాల్సి వచ్చింది.
బృంద పతివ్రతా ధర్మాన్ని నిలబెట్టడం కోసం విష్ణువు చేసిన ఒక లీల కారణంగా, ఆమె కోపించి ఆయనను రాయిగా మారిపోవాలని శపించింది. భక్తులపై దయతో, ముఖ్యంగా కలికాలంలో తనను సులభంగా పూజించడానికి వీలుగా, ఆ శాపాన్ని అంగీకరించి విష్ణువు సాలగ్రామ శిలగా అవతరించారు. ఈ కారణంగా సాలగ్రామ పూజలో తులసికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు.

సాలగ్రామ విశిష్టత: చక్రాలు, నిత్య సాన్నిధ్యం, సాలగ్రామ శిలలు కేవలం రాళ్ళు కావు. వాటిపై సహజంగా ఏర్పడిన చక్రం, శంఖం, గద వంటి విష్ణు చిహ్నాలు కనిపిస్తాయి. ఈ గుర్తులను బట్టే వాటిని లక్ష్మీనారాయణ, నరసింహ, దామోదర వంటి విష్ణువు యొక్క వివిధ రూపాలుగా గుర్తించి పూజిస్తారు.
సాధారణంగా దేవతా విగ్రహాలకు పూజ సమయంలో ఆవాహన (దేవతను ఆహ్వానించడం) చేయాల్సి ఉంటుంది కానీ సాలగ్రామాలలో శ్రీమహావిష్ణువు నిత్యం, స్వయంగా సన్నిహితమై ఉంటారు. అందుకే ఈ శిలకు ఆవాహనాది ఉపచారాలు అవసరం లేదు. దీనిని అభిషేకించిన తీర్థాన్ని సేవించడం వల్ల సర్వ వ్యాధులు, పాపాలు నశించి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
మోక్షాన్ని ప్రసాదించే శిల: సాలగ్రామం కేవలం పూజ వస్తువు కాదు, అది విష్ణువు యొక్క అనంత కరుణకు భక్తులపై ఆయనకున్న ప్రేమకు చిహ్నం. ఈ చిన్న శిల నిత్యం ఇంట్లో ఉండటం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యాన్ని, సకల శుభాలను ప్రసాదిస్తుంది. ఈ దివ్య రహస్యాన్ని తెలుసుకొని సాలగ్రామాన్ని పూజించే వారికి వైకుంఠ ప్రాప్తి తథ్యమని పురాణాలు ఘోషిస్తున్నాయి.
గమనిక: సాలగ్రామాలు నేపాల్లోని కాలి గండకీ నదిలోనే లభిస్తాయి. వీటిని కొనడం కంటే వంశపారంపర్యంగా పొందడం లేదా దానంగా స్వీకరించడం శ్రేయస్కరమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.
