ఈ రోజుల్లో చాలా మంది మహిళలను వేధిస్తున్న సమస్య PCOD (పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్). హార్మోన్ల అసమతుల్యత కారణంగా వచ్చే ఈ సమస్య మన జీవనశైలి, ముఖ్యంగా ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. పీసీఓడీకి కచ్చితంగా మెడిసిన్ అవసరం. అయితే కేవలం చికిత్స మాత్రమే కాదు, మన డైట్‌లో చిన్న మార్పులు చేసుకుంటే ఈ సమస్యను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. జంక్ ఫుడ్, చక్కెరలు లాంటి వాటికి దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన ఆహారంతో PCODని మన దరి చేరనీయకుండా ఎలా అడ్డుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆహారమే అసలైన ఔషధం: PCOD ఉన్నవారికి ఇన్సులిన్ నిరోధకత ఒక ప్రధాన సమస్య. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండవు. అందుకే మనం తినే ఆహారం రక్తంలో చక్కెరను నియంత్రించే విధంగా ఉండాలి. దీనికి ఉత్తమ మార్గం అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోవడం. బ్రౌన్ రైస్, క్వినోవా వంటి తృణధాన్యాలు, పప్పులు, బీన్స్ వంటి చిక్కుళ్ళు, అలాగే పాలకూర, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే సాల్మన్, అవిసె గింజలు, వాల్‌నట్‌లు వంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు హార్మోన్ల బ్యాలెన్స్‌కు సహాయపడతాయి.

ఏం తినాలి, దేనికి దూరంగా ఉండాలి?: మీ ఆహారంలో లీన్ ప్రోటీన్లు (చికెన్, చేపలు, టోఫు) చేర్చుకోవడం వల్ల కడుపు నిండుగా ఉండి, కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. బాదం, పిస్తా వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు, బెర్రీస్, చెర్రీస్ వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు చాలా మంచివి. అయితే PCOD ఉన్నవారు మైదాతో చేసిన పదార్థాలు, చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు (జంక్ ఫుడ్), మరియు అధిక కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులకు తప్పకుండా దూరంగా ఉండాలి. ఇవి హార్మోన్ల అసమతుల్యతను మరింత పెంచుతాయి. ఆహారంతో పాటు రోజువారీ వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం.
PCOD అనేది మీ జీవితాన్ని శాసించే వ్యాధి కాదు. సరైన ఆహారం, జీవనశైలి మార్పులతో మీరు దీనిని పూర్తిగా నియంత్రించవచ్చు. ఈ రోజు నుంచే జంక్ ఫుడ్‌కు గుడ్‌బై చెప్పి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో PCODకి చెక్ పెట్టండి.
గమనిక: పైన సూచించిన ఆహార మార్పులు కేవలం జీవనశైలిని మెరుగుపరచడానికి మాత్రమే. ఈ సమస్యకు సరైన చికిత్స, డైట్ ప్లాన్ కోసం తప్పకుండా డాక్టర్ ని సంప్రదించడం చాలా ముఖ్యం.
