భారతదేశ మహిళా ఆరోగ్య సంరక్షణ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్’ (SNSPA) ఏకంగా మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది. దేశంలో ప్రతి మహిళ ఆరోగ్యాన్ని, కుటుంబ శ్రేయస్సును మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఈ ప్రచారం, ప్రజారోగ్య ఉద్యమంలో మన దేశం సత్తా ఎంత గొప్పదో ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ అపురూప విజయం వెనుక ఉన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళా సంరక్షణలో మైలురాయి: ఈ దేశవ్యాప్త అభియాన్ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2, 2025 వరకు పోషణ్ మాహ్ (పోషకాహార మాసం) సందర్భంగా జరిగింది. ‘తల్లి ఆరోగ్యంగా ఉంటే, కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది’ అనే సిద్ధాంతంపై దృష్టి సారించి, ఈ ప్రచారం మహిళలు,యువతులు మరియు పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 19.7 లక్షల ఆరోగ్య శిబిరాలు నిర్వహించగా, 11 కోట్లకు పైగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఈ భారీ కమ్యూనిటీ భాగస్వామ్యం, డిజిటల్ ఆరోగ్య సాంకేతికతతో కలగలిసి, మూడు అద్భుతమైన గిన్నిస్ రికార్డులను సృష్టించింది.

సాధించిన గిన్నిస్ రికార్డులు: ఒక నెలలో ఆరోగ్య సంరక్షణ వేదికలో అత్యధిక నమోదు 3.21 కోట్లకు పైగా ప్రజలు నమోదు చేసుకున్నారు. ఒక వారంలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న అత్యధిక వ్యక్తులు 9.94 లక్షలకు పైగా నమోదు. ఒక వారంలో ముఖ్యమైన ఆరోగ్య సంకేతాల స్క్రీనింగ్ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న అత్యధిక వ్యక్తులు (రాష్ట్ర స్థాయిలో) 1.25 లక్షలకు పైగా నమోదు. ఈ రికార్డులు మన దేశంలో నివారణ ఆరోగ్య సంరక్షణ మరియు డిజిటల్ ఆరోగ్య సేవలను వినియోగించుకోవడంలో మహిళలు ఎంత చురుకుగా ఉన్నారో తెలియజేస్తున్నాయి.
స్వస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్’ విజయం కేవలం మూడు రికార్డులు మాత్రమే కాదు. ఇది ఆరోగ్యవంతమైన మహిళలు, శక్తివంతమైన కుటుంబాలు మరియు వికసిత్ భారత్ నిర్మాణానికి మన దేశం చేస్తున్న సామూహిక ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఈ రికార్డులు మహిళా ఆరోగ్యాన్ని ఒక జాతీయ ప్రాధాన్యతగా మారుస్తున్నందుకు మనమంతా గర్వించాలి.
