శరీరాన్ని శుభ్రం చేయడానికి (డిటాక్స్) గ్రీన్ టీలు, నిమ్మరసం డ్రింక్‌లు తాగుతున్నారా? అయితే వాటి కంటే వంద రెట్లు శక్తివంతమైన ఒక సూపర్ ఫుడ్ గురించి మీకు తెలుసా? అదే బ్రోకోలీ మొలకలు, ఈ చిన్నపాటి మొలకలు సాధారణ బ్రోకోలీ కంటే చాలా ఎక్కువ పోషకాలను కలిగి ఉండి, మీ శరీరం లోపల పేరుకుపోయిన విషపదార్థాలను సమర్థవంతంగా తొలగిస్తాయి. ఇంతకీ వీటిని డిటాక్స్ డ్రింక్స్‌తో పోలిస్తే అంత గొప్ప శక్తి ఎలా వచ్చింది? తెలుసుకుందాం..
శక్తికి కారణం – సల్ఫోరాఫేన్: బ్రోకోలీ మొలకలు అంత శక్తివంతంగా ఉండటానికి ప్రధాన కారణం వాటిలో అధిక మొత్తంలో ఉండే సల్ఫోరాఫేన్ అనే శక్తివంతమైన సమ్మేళనం. సాధారణ బ్రోకోలీలో కంటే, మూడు రోజుల వయస్సున్న మొలకల్లో ఈ సల్ఫోరాఫేన్ యొక్క ముందు రూపం 10 నుండి 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ సల్ఫోరాఫేన్ మన కాలేయాన్ని ప్రేరేపించడం ద్వారా, శరీరంలోని విషపదార్థాలు, కాలుష్యాలు మరియు హానికరమైన రసాయనాలను వేగంగా విచ్ఛిన్నం చేసి, మూత్రం ద్వారా బయటకు పంపడానికి సహాయపడుతుంది. అందుకే ఇది ఏ డిటాక్స్ డ్రింక్ కంటే అత్యంత సమర్థవంతమైనది.

క్యాన్సర్ నిరోధక శక్తి: సల్ఫోరాఫేన్ కేవలం సాధారణ డిటాక్సిఫికేషన్ మాత్రమే కాకుండా, శరీరంలోని కణాల స్థాయిలో రక్షణ కల్పిస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తూ, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది శరీరంలో ఉండే ఫేజ్-II డీటాక్స్ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తుంది. ఈ ఎంజైమ్‌లు డి.ఎన్.ఏ కు హాని కలిగించే టాక్సిన్‌లను తటస్థీకరించి, కణాలను రక్షిస్తాయి. అందువల్ల, బ్రోకోలీ మొలకలు కేవలం ప్రేగులను శుభ్రం చేయడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి.
సహజ డిటాక్స్ డ్రింక్‌ల ప్రయోజనాలు కేవలం నీరు, విటమిన్‌లు అందించడం వరకే పరిమితం కాగా బ్రోకోలీ మొలకలు మాత్రం లోతైన సెల్యులార్ డిటాక్సిఫికేషన్‌ను అందిస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ మొలకలను తమ ఆహారంలో తప్పక చేర్చుకోవాలి. ఉదయం సలాడ్స్‌లో శాండ్‌విచ్‌ల్లో లేదా జ్యూస్‌ల్లో కొద్ది మొత్తంలో వీటిని తీసుకోవడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.
