పాములు అంటే మనకు మొదట భయం కలగడం సహజం. ఈ సర్పాల లో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. వాటిని చూసినప్పుడు మనకు వెంటనే కలిగే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాములు ఎప్పుడూ కళ్ళు మూయవు కనురెప్పలు వేయవు. అవి నిద్రపోతున్నప్పుడు కూడా వాటి కళ్ళు తెరిచే ఉంటాయి. అసలు దీనికి కారణం ఏమిటి? వాటి కళ్ళపై ఏముంది? ఈ జీవికి ప్రకృతి ప్రసాదించిన ఆ ప్రత్యేకమైన, రహస్యమైన పొర ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం..
పాములకు కనురెప్పలు ఉండవు, కానీ వాటికి కళ్ళను రక్షించుకోవడానికి ప్రకృతి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని ఇచ్చింది. పాముల కళ్ళపై ‘స్పెక్టాకిల్’ (Spectacle) అని పిలవబడే ఒక పారదర్శకమైన పలుచని, స్థిరమైన పొర ఉంటుంది. ఇది అచ్చం కాంటాక్ట్ లెన్స్ (Contact Lens) లాగా కంటి గుడ్డును పూర్తిగా కప్పి ఉంచుతుంది. ఈ ప్రత్యేకమైన పొరే పాములు నిరంతరం కళ్ళు తెరిచి ఉంచడానికి ప్రధాన కారణం.

సాధారణంగా కనురెప్పలు కళ్ళను దుమ్ము, ధూళి మరియు తేమ కోల్పోకుండా కాపాడతాయి. పాములకు ఈ కనురెప్పలు లేకపోవడం వల్ల ఈ ‘స్పెక్టాకిల్’ పొర కళ్ళను రక్షిస్తుంది. ఈ పొర నిరంతరం కళ్లను తడిగా ఉంచే ద్రవాన్ని పట్టి ఉంచుతుంది తద్వారా కళ్ళు పొడిబారకుండా కాపాడుతుంది. అందుకే మీరు పాములను చూసినప్పుడు అవి మీ వైపు నిరంతరం నిర్లిప్తంగా చూస్తున్నట్లు అనిపిస్తుంది. అవి నిద్రలో ఉన్నాలేదా అప్రమత్తంగా ఉన్నా కూడ వాటి కళ్ళు తెరిచే ఉంటాయి.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ స్పెక్టాకిల్ పొర పాతదైనప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు, పాములు తమ చర్మాన్ని విడిచినట్లే, ఈ పొరను కూడా విడిచిపెడతాయి. పాము చర్మం ఒలిచే సమయంలో కళ్లపై ఉన్న ఈ పాత పొర కూడా తొలగిపోయి, దాని కింద కొత్త, స్పష్టమైన పొర ఏర్పడుతుంది. అందుకే పాము చర్మం ఒలిచే సమయానికి ముందు దాని కళ్ళు కాస్త మందకొడిగా కనిపిస్తాయి ఎందుకంటే పాత పొర అస్పష్టంగా మారుతుంది. చర్మం తొలగిపోయిన తర్వాత, పాము కళ్ళు మళ్లీ పూర్తిగా స్పష్టంగా కనిపిస్తాయి.ఇలా ఉండటం వలన పాములకు వేటాడుతున్నప్పుడు మరియు రక్షణ పొందుతున్నప్పుడు నిరంతరం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించే సామర్థ్యాన్ని ఇస్తుంది.
పాముల కళ్లపై ఉన్న ‘స్పెక్టాకిల్’ అనే ఈ పారదర్శక పొర వాటి మనుగడకు ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన బహుమతి. కనురెప్పలు లేకున్నా, వాటిని దుమ్ము ధూళి నుండి రక్షిస్తూ నిద్రలో కూడా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తెరిచిన కళ్ళతో చూడటానికి ఈ పొరే ఆధారం.
