కాళ్లు లేదా తొడల్లో నొప్పి రాగానే మనం వెంటనే అది విటమిన్ల లోపం అనుకుంటాం. క్యాల్షియం లేదా విటమిన్ డి టాబ్లెట్లు వాడితే తగ్గిపోతుందని భావిస్తాం. కానీ ప్రతిసారీ అది పోషకాహార లోపం కాకపోవచ్చు. తరచుగా వేధించే ఈ నొప్పుల వెనుక శరీరంలోని రక్త ప్రసరణ సమస్యలు లేదా నరాల ఒత్తిడి వంటి గంభీరమైన కారణాలు ఉండవచ్చు. ఈ నొప్పులు ఎందుకు వస్తాయి మన జీవనశైలిలో మార్పులు ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
తొడలు మరియు కాళ్లలో వచ్చే నొప్పికి ప్రధాన కారణాలలో పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD) ఒకటి. మన రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల కాళ్లకు రక్త ప్రసరణ సరిగ్గా జరగదు దీనివల్ల నడుస్తున్నప్పుడు లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది.
అలాగే ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుని పని చేయడం వల్ల వెన్నెముకలోని నరాలపై ఒత్తిడి పడి ‘సయాటికా’ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది తొడల నుండి పాదాల వరకు సూదులతో గుచ్చినట్లు లేదా తిమ్మిరిగా అనిపించేలా చేస్తుంది. కాబట్టి కేవలం విటమిన్ లోపం అని సరిపెట్టుకోకుండా రక్త ప్రసరణ మరియు నరాల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.

మరో ముఖ్యమైన కారణం శరీరంలో నీటి శాతం తగ్గడం (Dehydration) మరియు కండరాల అతి వినియోగం. మనం తగినంత నీరు తాగనప్పుడు కండరాలలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతిని కండరాలు పట్టేయడం లేదా నొప్పి రావడం జరుగుతుంది. దీనిని నివారించడానికి ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వడం అవసరం.
ఒకవేళ ఈ నొప్పి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా తగ్గకుండా వేధిస్తుంటే, అది లోతైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. సరైన సమయంలో స్పందించి వైద్య సలహా తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే పెద్ద ప్రమాదాలను అడ్డుకోవచ్చు.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. నొప్పి తీవ్రంగా ఉన్నా లేదా వాపు, రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
