కొత్తగా తల్లిదండ్రులైన వారికి పసిపిల్లల ప్రతి కదలిక ఒక అద్భుతమే, అలాగే చిన్న మార్పు వచ్చినా అదో పెద్ద ఆందోళనే. ముఖ్యంగా పాలు తాగిన తర్వాత పిల్లలు పాలు కక్కడం చూసి చాలామంది కంగారు పడిపోతుంటారు. ఇది అనారోగ్య లక్షణమా? లేక సహజమేనా? అన్న సందేహం ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. నిజానికి ఇది చాలా మంది శిశువుల్లో కనిపించే అతి సామాన్యమైన విషయం. దీని వెనుక ఉన్న అసలు కారణాలు మరియు నిపుణులు చెబుతున్న సలహాలేంటో ద్వారా తెలుసుకుందాం.
పాలు కక్కడం వెనుక ఉన్న అసలు కారణాలు: పసిపిల్లల్లో పాలు కక్కడం అనేది చాలా వరకు శారీరక పెరుగుదలలో ఒక భాగం మాత్రమే. పసిపిల్లల జీర్ణవ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందదు. ముఖ్యంగా ఆహార నాళానికి, పొట్టకు మధ్య ఉండే కండరం బలహీనంగా ఉండటం వల్ల, పాలు తాగినప్పుడు అవి సులభంగా తిరిగి పైకి వచ్చేస్తాయి.
దీనినే వైద్య పరిభాషలో ‘రిఫ్లక్స్’ అని పిలుస్తారు. పాలు తాగేటప్పుడు గాలిని కూడా లోపలికి పీల్చడం వల్ల, ఆ గాలి బయటకు వచ్చే క్రమంలో పాలను కూడా బయటకు నెడుతుంది. శిశువు యాక్టివ్‌గా ఉండి, బరువు సరిగ్గా పెరుగుతుంటే దీని గురించి అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: పిల్లలు పాలు కక్కడాన్ని తగ్గించడానికి కొన్ని చిన్నపాటి చిట్కాలు పాటించడం మంచిది. పాలు తాగించిన వెంటనే పిల్లలను పడుకోబెట్టకుండా, కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు భుజంపై వేసుకుని నిటారుగా ఉంచాలి. దీనివల్ల వారు మెల్లగా తేన్పు (Burp) ఇస్తారు, ఇది గ్యాస్‌ను బయటకు పంపి పాలు కక్కకుండా చేస్తుంది.
అలాగే, ఒకేసారి ఎక్కువ పాలు ఇవ్వకుండా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు పాలు పట్టడం మంచిది. పాలు తాగేటప్పుడు పిల్లల తల భాగం కాస్త ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. ఇవి పాటిస్తే చాలా వరకు ఈ సమస్య అదుపులోకి వస్తుంది.
సాధారణంగా శిశువుకు ఆరు నుండి పది నెలల వయస్సు వచ్చేసరికి ఈ పాలు కక్కడం దానంతట అదే తగ్గిపోతుంది. అయితే పాలు కక్కడం వల్ల శిశువు బరువు తగ్గడం, పాలు పట్టగానే ప్రాజెక్టైల్ వామిటింగ్ (ఫోర్స్‌గా కక్కడం) లేదా కక్కేటప్పుడు రక్తం చారికలు కనిపించడం వంటివి జరిగితే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిపుణులైన పీడియాట్రీషియన్‌ను సంప్రదించాలి. మీ చిన్నారి చిరునవ్వుతో హుషారుగా ఉంటే చిన్న చిన్న కక్కుల గురించి చింతించకుండా ఆ మాతృత్వాన్ని ఆస్వాదించండి.
