నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, నిద్రలేమి అనేవి చిన్న,పెద్ద తేడ లేకుండా అందరిని వేధిస్తున్న సమస్యలు. రోజంతా పని చేసి అలసిపోయినా, పడకపై చేరగానే నిద్ర పట్టక గంటల తరబడి దొర్లేవారు ఎందరో వున్నారు. దీనికి ఖరీదైన మందులు అవసరం లేదు, మన ఇంట్లోనే దొరికే చిన్న పరిష్కారం ‘ఫుట్ మసాజ్’. రాత్రి పడుకునే ముందు కేవలం 10 నిమిషాల పాటు పాదాలను మసాజ్ చేసుకుంటే కలిగే అద్భుతమైన మార్పులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మన పాదాల అడుగుభాగంలో శరీరంలోని వివిధ అవయవాలకు అనుసంధానమైన వేలాది నాడులు ఉంటాయి. ఆయుర్వేదం మరియు రిఫ్లెక్సాలజీ ప్రకారం, పాదాలను మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. రోజంతా కలిగిన మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
రాత్రి పూట గోరువెచ్చని నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో పాదాలను సున్నితంగా రుద్దడం వల్ల మెదడుకు ‘రిలాక్స్’ అవ్వాలనే సంకేతాలు అందుతాయి, దీనితో మనస్సు ప్రశాంతపడి గాఢ నిద్రకు మార్గం సుగమం అవుతుంది.

నిద్రలేమితో బాధపడేవారు ప్రతిరోజూ పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కుని మసాజ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అరచేతితో పాదాల మడమ నుండి వేళ్ల వరకు వృత్తాకారంలో మసాజ్ చేయడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా బ్రొటనవేలు కింద ఉండే భాగాన్ని నొక్కడం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి.
నూనెకు బదులుగా నెయ్యిని కూడా వాడవచ్చు. ఇది శరీరంలోని అధిక వేడిని తగ్గించి, కళ్ళకు చలువనిస్తుంది. ఈ చిట్కా కేవలం నిద్ర కోసమే కాకుండా, రోజంతా అలసిపోయిన కాళ్లకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.
ఆరోగ్యకరమైన జీవితానికి సరైన నిద్ర ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. రాత్రి నిద్ర సరిగ్గా ఉంటేనే మరుసటి రోజు మనం ఉత్సాహంగా పని చేయగలం. వేల రూపాయలు ఖర్చు చేసే థెరపీల కంటే, మన ఇంట్లోనే మనం చేసుకోగలిగే ఈ ‘ఫుట్ మసాజ్’ అత్యంత ప్రభావవంతమైనది.
