భీష్మ ఏకాదశి కేవలం ఒక క్యాలెండర్ తిథి మాత్రమేఅనుకుంటే తప్పే, ఎందుకంటే అది మన అంతరాత్మను శుద్ధి చేసుకునే ఒక గొప్ప అవకాశం. అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు శ్రీకృష్ణుడి సమక్షంలో విష్ణు సహస్రనామాలను లోకానికి అందించిన పవిత్ర ఘడియ ఇది. మోక్షం అంటే చనిపోయిన తర్వాత వచ్చేది మాత్రమే కాదు, బతికి ఉన్నప్పుడు పొందే మానసిక ప్రశాంతత కూడా. ఇక ఈ పుణ్య తిథి జనవరి 29వ తేదీన జరుపుకుంటాము. ఈ విశిష్టమైన రోజున మనం పాటించాల్సిన నియమాలు, ఆ పురాణ గాథ వెనుక ఉన్న అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
గంగాపుత్రుడు ధర్మానికి ప్రతీక : మహాభారతంలో భీష్ముడు లేదా గంగాపుత్రుడు ధర్మానికి, పితృభక్తికి మారుపేరు. తన తండ్రి శంతన మహారాజు సంతోషం కోసం రాజ్యభోగాలను త్యజించి, ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ఆయన చేసిన “భీష్మ ప్రతిజ్ఞ” అమోఘమైనది. ఈ త్యాగానికి మెచ్చిన తండ్రి ఆయనకు ‘ఇచ్చా మరణం’ (తాను కోరుకున్నప్పుడే ప్రాణం విడిచే శక్తి) ప్రసాదించారు. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక, సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే వరకు వేచి చూసి, మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఆయన విష్ణువులో ఐక్యమయ్యారు. అందుకే ఈ రోజును భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాం.

భీష్మ పితామహుడి త్యాగం – పురాణ నేపథ్యం: మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత, అంపశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి చూస్తున్న భీష్ముడిని చూడటానికి పాండవులతో కలిసి శ్రీకృష్ణుడు వెళ్తాడు. ధర్మ సందేహాలతో ఉన్న ధర్మరాజుకు, భీష్ముడు పరమాత్మ తత్వాన్ని వివరిస్తూ ‘విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని’ ఉపదేశిస్తాడు. ఈ అద్భుత ఘట్టం జరిగిన రోజే భీష్మ ఏకాదశి. ఒక యోగిలా తన ప్రాణాలను తన స్వాధీనంలో ఉంచుకుని మోక్షం పొందిన భీష్ముడిని స్మరిస్తూ ఈ రోజు చేసే పూజలు అనంతమైన ఫలితాలను ఇస్తాయని భక్తుల విశ్వాసం.
నియమాలు: ఈ రోజున ముఖ్యంగా ‘విష్ణు సహస్రనామ పారాయణం’ చేయడం అత్యంత శ్రేయస్కరం. ఉదయాన్నే తలస్నానం చేసి, విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి. ఆహారం విషయంలో బియ్యంతో చేసిన పదార్థాలకు (అన్నం) దూరంగా ఉండటం ప్రధాన నియమం. ఎందుకంటే, పురాణాల ప్రకారం ఈ రోజున అన్నంలో పాపం నివసిస్తుందని చెబుతారు. అలాగే మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి, మద్యపానం వంటి తామసిక అలవాట్లకు దూరంగా ఉండాలి. కోపం, అసూయ వంటి వికారాలకు తావు ఇవ్వకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడమే అసలైన వ్రతం.
