భారతీయ రైల్వే జనాల కోసం ఇప్పటికే అనేక రకాల రైళ్లను ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే దురంతో, గరీబ్‌రథ్, శతాబ్ది, రాజధాని.. తదితర అనేక రైళ్లు జనాలకు అందుబాటులోకి వచ్చాయి. ఇక ప్రస్తుతం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులను తరలించేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వాటిని శ్రామిక్ ప్రత్యేక రైళ్లుగా భారతీయ రైల్వే గుర్తించింది. ఇక ఈ రైళ్లకు సంబంధించిన పలు విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
* శ్రామిక్ రైళ్లను మే 1వ తేదీ నుంచి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి హటియా, జార్ఖండ్‌లకు ముందుగా తొలి శ్రామిక్ రైలు బయల్దేరింది.
* మొత్తం 6 స్పెషల్ శ్రామిక్ రైళ్లను ఇప్పటి వరకు నడిపారు. లింగంపల్లి నుంచి హటియా, అలువా నుంచి భువనేశ్వర్, నాసిక్ నుంచి లక్నో, నాసిక్ నుంచి భోపాల్, జైపూర్ నుంచి పాట్నా, కోటా నుంచి హటియాలకు ఈ రైళ్లు నడిచాయి.
* కరోనా లాక్డౌన్ కారణంగా ఒక ప్రాంతంలో చిక్కుకున్న ఇతర ప్రాంతాలకు చెందిన వలస కూలీలు, పర్యాటకులు, విద్యార్థులు, ఇతర వ్యక్తులు శ్రామిక్ రైళ్లలో తమ సొంత ఊళ్లకు వెళ్లవచ్చు.
* శ్రామిక్ రైళ్లు మధ్యలో ఎక్కడా ఆగకుండా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తాయి. ఇక వాటిలో వ్యక్తులను తరలిచేందుకు ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకారం అందించుకోవాలి. అలాగే కరోనా జాగ్రత్త చర్యలను, నిబంధనలను పాటించాలి.
* రైల్వే, రాష్ట్రాలకు చెందిన అధికారులు పరస్పర సహకారం, సమన్వయంతో శ్రామిక్ రైళ్లను నడిపించాలి.
* రైలు ప్రారంభానికి ముందే వ్యక్తులకు స్టేషన్లలో స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. కరోనా లక్షణాలు లేని వారినే ప్రయాణానికి అనుమతిస్తారు.
* రైళ్లలో ప్రయాణించే వారు మాస్కులను విధిగా ధరించాలి. అలాగే వారిని బస్సుల్లో రైల్వే స్టేషన్లకు తరలించినా.. కరోనా జాగ్రత్త చర్యలు పాటించాలి. బస్సులను శానిటైజ్ చేయాలి.
* రైళ్లలో ప్రయాణించే వారు సోషల్ డిస్టాన్స్‌ను పాటించాలి. నిబంధనలను పాటించే విధంగా అధికారులు పర్యవేక్షించాలి.
* శ్రామిక్ రైళ్లలో ప్రయాణికులకు కావల్సిన ఆహారాన్ని వారిని గమ్యస్థానాలకు పంపుతున్న రాష్ట్రాలే అందివ్వాలి. అలాగే సుదీర్ఘ ప్రయాణం అయితే.. రైల్వేలు వారికి కావల్సిన నీరు, ఆహారాన్ని అందిస్తాయి.
* ఇక గమ్యస్థానాలకు ప్రయాణికులు చేరుకోగానే.. వారికి అక్కడ కూడా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి. కరోనా లక్షణాలు లేవని నిర్దారించుకున్నాకే వారిని ఆ రాష్ట్రంలోకి అనుమతించాలి.