లాక్‌డౌన్ 3.0 నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ఆంక్షలను సడలించాక.. మద్యం షాపులను ఓపెన్ చేయడంతో.. మందు బాబులు మద్యం షాపుల వద్ద పోటెత్తారు. కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడి మరీ మద్యం కొనుగోలు చేశారు. పలు చోట్ల మందుబాబులు పెద్ద ఎత్తున మద్యం కొని ఇండ్లలో స్టాక్ పెట్టుకున్నారు. అయితే మద్యం అమ్మకాలు మళ్లీ మొదలై ఒక్క రోజు కూడా కాకముందే మందు బాబులకు కరెంట్ షాక్ కొట్టించే వార్తను ఆ ప్రభుత్వం చెప్పింది.
ఢిల్లీలో మద్యం రేట్లపై 70 శాతం అదనంగా వసూలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే నోటీసు విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం అక్కడ అమ్ముడవుతున్న అన్ని రకాల మద్యం ఎంఆర్‌పీపై 70 శాతం అదనంగా వసూలు చేయనున్నారు. దీన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ కరోనా ఫీజు కింద వసూలు చేస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వం ఇప్పటికే మద్యం ధరలను 25 శాతం పెంచి మళ్లీ మద్యం అమ్మకాలను ప్రారంభించగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం మద్యం అమ్మకాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
కాగా 40 రోజుల తరువాత మద్యం అమ్మకాలు మళ్లీ ప్రారంభమవడంతో ఆయా రాష్ట్రాలకు మళ్లీ నిత్యం రూ.కోట్లలో ఆదాయం వస్తోంది. ఏపీకి ఒక్కరోజే రూ.60 కోట్ల ఆదాయం రాగా, కర్ణాటకకు రూ.45 కోట్ల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా వచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఆదాయం నష్టాల్లో ఉన్న ఆయా రాష్ట్రాలకు కొంత వరకు ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.