భళి భళి భళిరా భళి.. సాహోరే రాజమౌళి..

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అంత కష్టం కాదేమో..! ఎందుకంటే అప్పటి వరకూ అందరూ అక్కడిదాకా వెళ్ళాలన్న ఆలోచనతో ఉండి ఉంటారు. కానీ అస్సలు ఊహించని దాన్ని నిజం చేసి చూపించడమే చాలా కష్టం.. అది చేసి చూపినవారు ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకి వ్యాపింపజేసాడు. ప్రాంతీయ భాషల సినిమాలని కూడా ప్రపంచ సినిమాకి ధీటుగా తెరకెక్కించవచ్చని నిరూపించిన దర్శకుడు రాజమౌళి.

ఐదు వందల కోట్ల బడ్జెట్.. 2500కోట్లకి పైగా వసూళ్ళు.. రిలీజైన ప్రతీ భాషలోనూ అత్యధిక కలెక్షన్లు బాహుబలివే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. బాహుబలికి ముందు ఈ లెక్కలన్నీ ఎవరికైనా చెప్తే నవ్వేసి ఊరుకునేవారే… కానీ బాహుబలితో లెక్కలన్నీ మారిపోయాయి. తెలుగు సినిమా విశ్వవ్యాప్తం అవుతుంది. పాన్ ఇండియా ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు వెనుకాడట్లేదు. దానికి కారణం బాహుబలి. బాహుబలి వల్లే సైరా తీయగలిగాం అని మెగాస్టార్ చిరంజీవి గారు వేదిక మీద చెప్పిన సంగతి తెలిసిందే.

ఏ దేశంలో ప్రజలకయినా ఎమోషన్ ఒకేలా ఉంటుందన్న విషయాన్ని నమ్మిన రాజమౌళి బాహుబలితో ఆ విషయాన్ని నిరూపించాడు. రాజమౌళి సినిమాలో ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి. అవును మరి.. ఈగ చనిపోతే ప్రేక్షకులు అంతగా ఎందుకు బాధపడతారు. నాలుగు వందల సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రేమంటే ఎలా ఒప్పుకుంటారు.. అదంతే.. అక్కడున్నది రాజమౌళి. ఏ సీన్ ఎక్కడి వరకు తీస్తే ఎంతందంగా ఉంటుందీ. ఎక్కడ ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడన్న విషయాలు రాజమౌళికి బాగా తెలుసు.

బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్టోబర్ 22వ తేదీన రిలీజ్ అవబోయే ఎన్టీఆర్ లుక్ కోసం అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.