హీరో కార్తికేయ కొత్త చిత్రం 90ఎం.ఎల్.లోని మొదటి పాట “ఇనిపించుకోరు ఇనిపించుకోరు” ఇటీవల విడుదలయి అబ్బాయిలకి తెగ నచ్చేస్తోంది .”ఇనిపించుకోరు ఇనిపించుకోరు అమ్మాయిలస్సలే ఇనిపించుకోరు” అంటూ సాగే ఈ పాట అమ్మాయిల ప్రవర్తనతో విసిగిపోయిన అబ్బాయిలందరి మాటలుగా రాహుల్ సిప్లిగంజ్ గాత్రంలో, చంద్రబోస్ సాహిత్యంలో, అనూప్ రూబెన్స్ సంగీతంలో అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకోవడం, `ఆర్ ఎక్స్ 100` వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తీసిన కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ `90 ఎం.ఎల్` సినిమా నిర్మిస్తుండడం ఈ చిత్రానికి ప్రస్తుతం కలిసొచ్చే అంశాలు.
దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర ఈ పాట గురించి మాట్లాడుతూ “జానీ మాస్టర్ ఆధ్వర్యంలో హీరో, 50 మంది డాన్సర్లతో 150 మంది జూనియర్ ఆర్టిస్టులతో కోకాపేటలో పెద్ద సెట్ వేసి 4 రోజులుచిత్రీకరించాం. ఈ పాటకి చంద్రబోస్ అందించిన సాహిత్యానికి తగ్గట్టుగానే కార్తికేయ స్టెప్స్ తో పాటు రాహుల్ సిప్లిగంజ్ గాత్రం కూడా తోడవడంతో పాటకి అనుకున్న దానికంటే ఎక్కువ ఆదరణ లభిస్తోంది . ఇక సినిమా విషయానికి వస్తే ఇందులో హీరో కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు `దేవదాస్`, ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. అంతటి విద్యావంతుడు ఆథరైజ్డ్ డ్రింకర్‌గా ఎందుకు అయ్యాడు అన్న కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది? ఇందులో యూత్ కి మాత్రమే కాక ఫామిలీ ఆడియన్స్ కి కావాల్సిన అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి“ అన్నారు.