ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ చిన్నారి అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో మూడ్రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు ఇప్పటికే జనసేన వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక మార్క్ ఆరోగ్యంపై ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆరా తీశారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
ఈ నేపథ్యంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కూడా పవన్ కళ్యాణ్ తనయుడికి జరిగిన ప్రమాదంపై స్పందించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తాజాగా తారక్ ఓ పోస్టు పెట్టారు. పవన్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని తాను దేవుణ్ని ప్రార్థిస్తున్నానంటూ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ వార్త తెలిసి ఎంతో బాధపడ్డానని తెలిపారు. ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్ అంటూ తారక్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఇక తారక్ పోస్టుతో నందమూరి అభిమానులతా గెట్ వెల్ సూన్ మార్క్ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.