ప్రతి జన్మా ప్రత్యేకం
ప్రతి రేయీ ప్రత్యేకం
ప్రతి రోజూ పాపాయి ఎదిగే వేళ
తల్లి గర్భంలో నిలిచే సమయం
గడిపే సమయం అన్నీ అన్నీ ఇవాళ కాజల్ కు ప్రత్యేకం
మన పంచదార బొమ్మకు అభివందనం….
అందాల తారలు ఆకాశంలో..అందాల తారలు ఇలాతలంలో అంటే ఈ నేలపై నడయాడే తారలకు ప్రేమాన్విత కానుకలను అభిమానులే అందించాలి. ఆ విధంగా కాజల్ కొన్ని కానుకలు నవ్వుల రూపంలో ఇస్తున్నారు. తన కుటుంబంలో తాను నిర్మించుకున్న బంధాలలో కొత్త నిర్వచనాలు వెతుకుతున్నారు. అందాల కాజల్ తల్లి హోదాను అందుకుంటున్నారు.
ఆ ప్రేమ పరవశాన మునిగిపోవడంలో ఆమె హాయిగా ఉన్నారు. లోకాన్ని చూసే పసికందుకు కొన్ని ఊహలు అందిస్తున్నారు. లోకాన్ని చూసే వేళ పసి పాదాలకు నడకలు నేర్పే వేళ ఏ విధంగా తాను ఉండాలో కూడా ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు. బిడ్డలకు తల్లులు ఆదర్శం అయితే చాలు. ఆ ఆదర్శం ముందున్న కాలంలో ఆచరణ అయితే దేశం మరియు ప్రపంచం తల్లులను కీర్తిస్తాయి.
అలాంటి కీర్తిని నేలపై నడయాడే తారలు అందుకోవాలి అన్నది కాజల్ కోరిక కావొచ్చు. అలాంటి కీర్తికీ మరియు యశస్సుకూ ప్రతినిధులుగా నిలిచిన ఎందరో తల్లులు ఇవాళ కాజల్ కు ప్రేరణ కావొచ్చు. త్వరలో లోకం చూసే బిడ్డకు స్వాగతం..శివయ్య ఆశీస్సులతో కాజల్ మరిన్ని సంతోషాలను అందుకోవాలి కూడా!
బిడ్డలు తల్లులూ ఒకే సారి ఎదుగుతారు అని చదివేను. అవును! బిడ్డలకు రెక్కలు ఇచ్చే వరకూ తల్లులు ప్రేమకు మరియు అభిమానానికి స్వార్థం అన్నది లేకుండా ఉంచుకుంటారు. తమ కోసం అంటూ ఏమీ ఉంచుకోకుండా బిడ్డలకు తల్లులు అన్నీ అయి ఉంటారు. ఉండాలి కూడా! రెక్కలు ఇచ్చాక లేదా పరుగులు నేర్పాక ప్రేమాన్విత లోకాన్ని ఎవరికి వారు నిర్మించడం సులువు చేసుకున్నాక బిడ్డలు లోకానికి తల్లులు ఇచ్చిన కానుకలు.
అందాక తల్లులు బిడ్డల విషయంలో శ్రద్ధతో పాటు ఇంకొన్ని జాగ్రత్తలూ పాటించాలి. ఇవన్నీ బిడ్డలు లోకాన్ని చూశాక.. అయితే తొమ్మిది నెలలు మాతృగర్భంలో దాక్కొని ఉన్న బిడ్డలకు కొన్ని కథలు తెలుస్తాయి. తల్లి ఊసులు నడవడి ఆమె ఆహారపు అలవాట్లూ అన్నీ కూడా నవజాత శిశువుపై ప్రభావం చూపుతాయి. ఈ ఊసులు వీటికి మించిన ఊహలు అందాల కాజల్ వింటున్నారు. వింటూ వింటూ ఆనందిస్తున్నారు. ఆ ఆనందాల తుళ్లింతల్లో ఆమె భర్త గౌతమ్ కూడా ఉన్నారు.
మాధుర్య ప్రధానం మాతృత్వం.ప్రేమకూ లాలిత్యానికీ సంకేతం మాతృత్వం.త్వరలో పండంటి బిడ్డకు జన్మనిచ్చి మాతృ రూపంలో కాజల్ మరో జన్మను అందుకోనున్నారు. తల్లి పాత్రలో ఆమె మరో కొత్త ఆనందాన్ని అందుకోనున్నారు.అప్పుడామె ప్రపంచం పూర్తిగా మారిపోనుంది. ఆ విధంగా ఆమె మరో కొత్త రూపాన్ని లావణాన్నీ ప్రేమనూ అందుకుని మనకు తారసపడనున్నారు. ఆవిధంగా పంచాదార బొమ్మ కొత్త దేవత రూపానికి ప్రతిరూపం కానుంది.
– బ్యూటీ స్పీక్స్ – మనలోకం ప్రత్యేకం