రాఘవేంద్రరావు పేరు వెనుక బి.ఎ. ఎందుకో తెలుసా?

-

ఎన్నో మధురమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి మంచి విజయాలను సొంతం చేసుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆయన చిత్రాల్లో ప్రతీ ఫ్రేమ్‌లోనూ భారీదనం కనపడుతుంది. అంతకుమించి కథానాయికలను అందంగా చూపించడంలో ఆయనకు సాటి మరెవ్వరూ లేరు. తన తండ్రి ప్రకాశ్‌ దగ్గర దర్శకత్వ మెళకువలు నేర్చుకున్న ఆయన ‘బాబు’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు.

100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనది. రాఘవేంద్రరావు అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది పువ్వులు, పళ్లు. అవి చెట్టుకు ఉన్నప్పటికంటే హీరోయిన్ల నాభీపై పడుతూ… తన కెమెరాకు చిక్కినప్పుడు అందంగా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదేమో. అంతగా తెరపై తనదైన ముద్ర వేశారు. అయితే ఆయన తెరకెక్కించిన ప్రతి చిత్రంలో టైటిల్స్‌లో తన పేరు చివరిన బి.ఎ.అని వేసుకుంటారు. అలా ఎందుకు పెట్టుకుంటారోనని చాలామందికి అదొక భేతాళ ప్రశ్నలాగే ఉంది.

తన పేరు చివరిలో బి.ఎ. పెట్టుకోవడం వెనుక కారణాన్ని రాఘవేంద్రరావు ఒక సందర్భంలో పంచుకున్నారు. ‘దర్శకుడు కాకపోతే మీరు ఏమయ్యేవారు?’ అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. “నేను డైరెక్టర్‌ కాకపోతే డ్రైవర్‌ అయ్యేవాడిని. ఎందుకంటే నాకు ఏమీ తెలియదు. అప్పట్లో బి.ఎ. చదివిన వాళ్లకు ఏం ఉద్యోగం వస్తుంది? కనీసం డ్రైవర్‌కు ఇచ్చే శాలరీ కూడా రాదు. మొదట్లో రెండు, మూడు చిత్రాలకు రాఘవేంద్రరావు బి.ఎ. అని టైటిల్‌ వేస్తే బాగా ఆడాయి. ఒక సినిమాలో నా పేరు వెనుక డిగ్రీని పెట్టలేదు. ఎందుకు పెట్టలేదో కూడా నేనూ అడగలేదు. ఆ సినిమా పోయింది. అప్పుడు సెంటిమెంట్‌ అనిపించి, పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌గారికి గుర్తు చేశా. ‘ఏవండీ నా కోరిక కాదు కానీ, సెంటిమెంట్‌గా అనిపించింది. తర్వాతి చిత్రంలో నా పేరు చివరిన బి.ఎ. యాడ్‌ చేయండి’ అని చెప్పా. ఇక డైరెక్టర్‌ను కాకపోతే ఏమయ్యేవాడిని అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. కనీసం చెక్‌ రాయడం రాదు.. టికెట్‌ కొనుక్కోవడం రాదు.. ప్రొడక్షన్‌ మేనేజర్లు, నిర్మాతలు నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవారు. అన్నీ వాళ్లే చూసేవారు. బి.ఎ. చదివిన వాళ్లకు రూ.5వేలకు మించి జీతం ఇవ్వరు. ఆ తర్వాత గుర్తుకొచ్చింది డ్రైవింగ్‌ బాగా చేస్తానని. అందుకు డ్రైవర్‌ అయ్యేవాడిని’ అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version