సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లడం కామన్. ఇప్పటికే సినిమా రంగం నుంచి పదుల సంఖ్యలో హీరోయిన్లు, హీరోలు, ఇతర నటులు రాజకీయాల్లోకి వచ్చారు. కొందరు నటిస్తూ రాజకీయం చేస్తుంటే మరికొందరు నటన వదిలేసి ప్రజాసేవపై దృష్టి సారించారు. తాజాగా రాజకీయాల్లోకి మరో నాయిక అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ, మోడల్ నేహాశర్మ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. నేహా టాలీవుడ్లో రామ్ చరణ్‌తో కలిసి చిరుత, వరుణ్ సందేశ్‌తో కలిసి కుర్రాడులో నటించింది.
బిహార్ నుంచి నేహా శర్మను బరిలోకి దింపాలని ఆమె తండ్రి, కాంగ్రెస్ నేత అజయ్ శర్మ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారట. దీనిపై తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిహార్‌లోని భగల్పుర్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉందని, ‘ఇండియా’ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానం కాంగ్రెస్‌కే దక్కాలని అన్నారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయని, ఒకవేళ ఈ సీటు తమ పార్టీకి వస్తే.. తాను పోటీ చేయడం లేదా తన కుమార్తె నేహాశర్మను బరిలోకి దించాలని భావిస్తున్నానని తెలిపారు. దీనిపై పార్టీని సంప్రదిస్తున్నానని, తుది నిర్ణయం హైకమాండ్‌దేనని అజయ్ శర్మ వెల్లడించారు.