చిరంజీవి స్వీట్ మెమొరీస్ ని తమ్ముడు కెలికేశాడు?

-

పూర్తిగా సినిమాల్లో ఉన్నప్పుడు చిరంజీవికి, ప్రజారాజ్యం సమయంలో చిరంజీవికి, 150 సినిమా తర్వాత చిరంజీవికి చాలా తేడా ఉందని చెబుతున్నారు సినీ విశ్లేషకులు! ఆ విశ్లేషణలో నిజా నిజాల సంగతి కాసేపు పక్కనపెడితే… అప్పటితో పోలిస్తే.. ఈ మధ్యకాలంలో అందరినీ కలుపుకుపోతూ, అందరివాడిగా అనిపించుకోవాలనే ఆలోచన మెగాస్టార్ ఎక్కువగా చేస్తున్నారని అంటున్నారు సన్నిహితులు! తానేంటో, తన స్థాయేంటో జనాలకు తెలిసినప్పుడు మళ్లీ ప్రత్యేకంగా వాటిని చూపించుకుంటూ నడుచుకోవడం కంటే.. సీనియర్లను గౌరవిస్తూ.. జూనియర్లను ప్రోత్సహిస్తూ ప్రయాణం సాగించాలని నమ్మి అలానే చేస్తున్నారు చిరు అని అంటున్నారు.

గతంలో కూడా తనపై కానీ, చరణ్ పై కానీ ఏవైనా విమర్శలు వచ్చినా కూడా చిరు సామరస్యంగానే స్పందిస్తూ, విషయాన్ని పెద్దది చేయకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. దీంతో వీలైనంత వివాదాస్పదంగా వ్యవహరించడంలో పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో మెగా అభిమానులకు – నందమూరి అభిమానులకు ఏమాత్రం పడదని ఇండస్ట్రీ బయటా లోపలా టాక్! కాస్త బయటకు వచ్చి గ్రౌండ్ లెవెల్ లో సంఘటనలు చూస్తే అవి కాస్త నిజం అనిపించక మానదు. అయితే… ఆ విషయాలు పక్కనపెట్టిన చిరు… ఎన్టీఆర్ జయంతి రోజున “తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం, తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం, నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ.. ” అంటూ ఒక స్వీట్ మెమరీని పోస్ట్ చేశారు! దీంతో నందమూరి ఫ్యాన్స్ కి దగ్గరయ్యారు చిరంజీవి!

కానీ… తాజాగా తెలుగు సినిమా పెద్దలు కేసీఆర్ ను కలవడం, ఆ మీటింగ్ కి బాలయ్యను పిలవకపోవడం, అనంతరం ఆ విషయంపై బాలయ్య తనదైన శైలిలో కాస్త ఆవేశంగా మాట్లాడటం జరిగిపోయాయి. కానీ… ఈ విషయంపై చిరు ఏమాత్రం స్పందించలేదు! తన హుందాతనాన్ని కాపాడుకుంటూ, మౌనంగా ఉంటే అన్నీ సర్ధుకుంటాయన్నట్లుగా ప్రవర్తించారు. కానీ… ఈ విషయంలో కందకు లేని దురత అన్నట్లుగా నాగబాబు ఫైరయిపోయారు! ఫలితంగా వ్యవహారం చినికి చినికి గాలివానగా మారిపోయింది! దీంతో… ఎన్టీఆర్ జయంతి నాటినుంచి చిరుని అభినందిస్తున్న నందమూరి ఫ్యాన్స్ నాగబాబుతో పాటు చిరుని కూడా విమర్శించడం మొదలుపెట్టారు. దీంతో… చిరంజీవి స్వీట్ మెమొరీస్ ని తమ్ముడు కెలికేశాడయ్యా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు మొదలైపోయాయి!! సరిగ్గా ఆలోచిస్తే… తన కామెంట్ల వల్ల నాగబాబు కొత్తగా పెంచుకున్న ఖ్యాతి ఏమీ లేదు, సంపాదించుకున్న పేరూ ఏమీ లేదు! అనవసరంగా అన్నకు ఉన్న స్వీట్ మెమరీస్ ని కెలకడం తప్ప!!

Read more RELATED
Recommended to you

Exit mobile version