ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఈఎస్ఐకి సంబంధించిన కేసులో జైలు శిక్ష పడిన ఆమెకు, తాజాగా మరో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో నియమావళి ఉల్లంఘించినందుకు ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో భాగంగా ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలంటూ ప్రజాప్రతినిధుల కోర్టు రాంపుర్ ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే
2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాంపుర్ నుంచి ఎంపీగా పోటీ చేసిన జయప్రదఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా అనేక సార్లు ప్రజాప్రతినిధుల కోర్టు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించకపోవడంతో కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.