అర్జున్ రెడ్డి కన్నా అధ్వాన్నం డియర్ కామ్రేడ్

-

 ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో చూస్తే అర్జున్ రెడ్డి వావ్ అనిపించే సినిమా కానీ అంతా బాధ్యతారహిత్యంగా నడిచిన కథ.. అట్లాగే ఉంటుంది డియర్ కామ్రేడ్ కూడా. ‘ఒక కామ్రేడ్ పోరాడితే అతనికది స్వేచ్ఛనివ్వాలి, హాయినివ్వాలి’ అన్న డైలాగ్ కు, హీరో విధానానికి ఎలాంటి సంబంధం ఉండదు. కామ్రేడ్ కు ఉండాల్సిన గుణాన్ని మరిచిన కార్యెక్టర్ హీరోది. మూర్ఖంగా, బాధ్యతారహితంగా ప్రవర్తించే తీరు కనిపిస్తుంది.. అందుకే అర్జున్ రెడ్డి కన్నా అధ్వాన్నంగా ఉంటుందని చెప్పక‌ తప్పదు. చెప్పాలంటే ఈ సినిమాలో ‘కామ్రేడ్’ హీరో కాదు. హీరోయిన్. అమె లక్ష్యం, ప్రేమపట్ల అమె అభిప్రాయం, సెల్ఫ్ కంట్రోల్, అలోచనా తీరు ఇవ్వన్నీ అమెలోని కామ్రేడ్ లక్షణాలు. సినిమాలో హీరోది ఉడుకు రక్తం కాబట్టి సాధారణంగానే ఘర్షణలకు దిగుతాడు. కానీ అవి ఎలాంటి ఫలితాలిస్తాయో అలోచించకపోవడం అదొక అర్థం లేని అవేశంగా కనిపిస్తుంది.

విద్యార్థుల స్ట్రగుల్ తో మొదలైన సినిమాలో మొదట్లోనే ప్రొగ్రెసివ్ తిరుగుబాటు కనిపిస్తుంది. అక్కడక్కడా చే, సుందరయ్య, ఎర్రజెండా కనిపిస్తాయి.‌ తిరుగుబాటు నినాదాలు వినిపిస్తాయి. మొదలు‌ మినహా సినిమా‌ అంతా ప్రశ్నించే తత్వం, తిరుగుబాటు కనిపించినా కామ్రేడ్ లక్షణాలతో చేసినవి కావు.. అన్ని సినిమాల్లో హీరోలు ప్రవర్తించే తీరే, అర్జున్ రెడ్డిలో యాటిట్యూడే అది.‌ కానీ ఇక్కడ కామ్రేడ్ అని కొత్తగా చెప్పుకొచ్చారు. హీరో అతని పట్ల, ప్రేమికురాలి పట్లా తీసుకొనే ప్రతీ నిర్ణయం అవగాహన లేమి, మూర్ఖత్వం, అనవసరం గానే కనిపిస్తాయి. కామ్రేడ్ కు ముందుచూపు ఉండాలి. ప్రేమ పట్ల మెర్చ్యురిటి ఉండాలి. ఆ కామ్రేడ్ కు విశాల హృదయం, పెద్ద మనసు ఉండాలి. ఆ ప్రేమ కోసం ఎక్కడికైనా వెళ్లగలగాలి. ప్రపంచంతో పోరాడగలగాలి. ప్రేమ కోసం పోరాటాన్ని, పోరాటం కోసం ప్రేమను పక్కకు పెట్టాలనుకునేవాడు కామ్రేడే కాదు. ప్రేమ, పోరాటం రెండూ ముఖ్యమే. పోరాటంలో గెలవాలి. ప్రేమలో పోరాడి గెలవాలి.

కానీ ఈ సినిమాలో‌ భిన్నంగా జరుగుతుంది. హీరోయిన్ ను ప్రేమించిన తర్వాత మూడేండ్లు ఎక్కడికో వెళ్తాడు కామ్రేడ్ అని పిలువబడే హీరో.. కానీ అది ప్రేమ కోసం‌ కాదు. అన్నీ వదిలేసి, అందర్నీ వదిలేసి ప్రశాంతంగా బతకడానికి, అతను మారడానికి ఎవరికీ చెప్పకుండా సౌండ్ హియరింగ్ ప్రాజెక్టు చేయడానికి వెళ్తాడు. అలా చేయాలనుకుంటే కాశ్మీర్ వెళ్లి సౌండ్ హియరింగ్ చేసినా.. కాశీ వెళ్లి సన్యాసుల్లో‌ కలిసినా ఒక్కటే. ప్రేమకోసం అమ్మాయి వెంట పడడం, వద్దన్నందుకు అన్నీ వదిలేసి వెళ్లి మారాలనుకోవడం ప్రేమికుని ( కామ్రేడ్) లక్షణమా? (ఇంకా దీన్ని చెగెవారా మోటార్ సైకిల్ యాత్ర లెవెల్ లో కొందరు ఫీలవడం కామెడీకే కామెడీ). పైగా ఈ జర్నీలో రికార్డు చేసిన జ్ఞాపకాలను, అవేదనను ఒకానొక సమయంలో హీరోయిన్ కి ఇస్తాడు. భాదేసినా, ఒంటిగా ఫీల్ అయినా ఆ మాటలు విను అని చెప్తాడు. అలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ కు ఆ రికార్డింగ్ ఇవ్వడం స్వార్థం. ప్రతీ క్షణం హీరోయిన్ గురించే అలోచించినట్టు, అతని ప్రేమను నిరూపించుకోవాలనుకొనే స్వార్థం.

కామ్రేడ్ గా అతను రికార్డు చేసి ఇవ్వాల్సింది మోటివేషనల్ మాటలై ఉంటే బాగున్ను. అది ఆమెకు ఉత్ప్రేరకంగా పని చేయాలి కానీ ప్రేమ వల్ల కలిగే అవేదనను తట్టి లేపుతుంది. ప్రాజెక్టు మధ్యలో ఏదో పని మీద వచ్చి, అనుకోకుండా హిరోయిన్ ను కలుసుకోవడం‌ ఏంటి? ట్రీట్ మెంట్ లో ఉన్న ఆమెను ఎవరికీ తెలియకుండా తీసుకెళ్లడం ఏంటి? ఎంతటి భాద్యతా రాహిత్యం‌ ఇది? “. క్రికెట్ ను పూర్తిగా వదిలేశాను. ఇప్పుడు నా గోల్ నువ్వే” అని హీరోయిన్ అంత క్లియర్ గా, ఆనందంగా చెప్పినపుడు అర్థం చేసుకొని, సరైన మార్గంలో వివరాలు కనుక్కోవాలి. అమె మీద అమెకు కంట్రోల్ ఉన్నప్పటికీ ప్రతీ సందర్భంలో హీరో అమెపై, అమె అలోచనలపై అధిపత్యం చెలాయిస్తాడు. అమె చుట్టూ‌ మళ్లీ తీవ్రమైన ఒత్తిడి వాతావరణం ఏర్పడడానికి కారణం అవుతాడు. అమె అసహ్యించుకొనేలా చేసుకుంటాడు. అసలు ఒక‌ కామ్రేడ్ ప్రేమకు త్యాగం తెలిసి ఉండాలి. పోరాటపటిమకు ప్రేమికురాలు తోడవ్వాలి. ప్రేమికురాలికి‌ ఆ కామ్రేడ్ కొండంత అండ‌గా ఉండాలి, అతనిపై బండెడు నమ్మకం ఉండాలి. ఇద్దరి గెలుపు వెనక ఇద్దరి కష్టం, కృషి ఉండాలి.. కానీ ఇందులో హీరో గుణమే హీరోయిన్ కు పెద్ద సమస్య. చివరి వరకూ అది అలాగే సాగుతుంది..‌

క్లైమాక్స్ లో అమె అమె ఒక‌సంఘటన మీద తిరగబడుతుంది. దీనికి కారణం ‘ధైర్యాన్ని ఇచ్చే కామ్రేడ్ నా జీవితంలో ఉన్నాడు’ అని చెప్తుంది. ‌కానీ అమె తిరుగుబాటుకు, హీరోకు సంబంధం ఉండదు. ‘ఆమె ట్యాలెంట్ లేని క్రీడారారిణి, అడ్డదారులు తొక్కింద’ని అవమాన పరిచిన స్పోర్ట్స్ ఆఫీసర్ మాటలకు ఆమె తట్టుకోలేక పోతుంది. పైగా హీరో జైల్లో ఉండడం ఆమెకు ఇష్టం ఉండదు. అందుకే ధైర్యం తెచ్చుకుంటుంది.. కానీ ఈ సందర్భంలోనూ హీరో ప్రవర్తించిన తీరు నెగిటివ్ ఇంపాక్ట్ గానే ఉంటుంది. ఈ విషయం‌ కారణంగానే ఏకంగా కాలేజీ లెక్చరర్ ను కొట్టడం దారుణం.‌ ఇంకా‌ కమిటీ జరుగుతున్నప్పుడు సహనం‌ కోల్పోయి వాగ్వాదానికి దిగడం అర్జున్ రెడ్డిలో కూడా చూడొచ్చు. ఇట్లా బాధ్యతలు మరిచిన హీరో ఈ సినిమాలో‌ కామ్రేడ్ గా ఉంటాడు.

సినిమా‌ మొత్తం ఈ హీరో ప్రేమను నిలుపుకోవడంలో ఎలాంటి ఆదర్శం కనిపించదు. కామ్రేడ్ ప్రేమలో‌ ప్రత్యేకత‌ ఏంటో తెలుపలేకపోగా ఆ‌ పేరుతో మరింత తప్పుడు సందేశం ఇచ్చారు. కామ్రేడ్, ప్రేమ, హక్కులు, పోరాటం అనే పదాలు వినిపించినా వాటిలోని గొప్పదనం అసలే చూపించలేదు. రెగ్యులర్ గా వచ్చే సినిమాల్లో ఇదీ ఒకటి.‌ దీనికి కామ్రేడ్ అని తగిలించి ఆకర్షించే ప్రయత్నం చేశారు. అర్జున్ రెడ్డికి సీక్వెల్ అనుకుంటే సరిపోద్ది. కామ్రేడ్ పేరు చూసి, అతని ప్రేమలో పోరాటం ఉందని నమ్మిన కామ్రేడ్లు ఎవరైనా ఉంటే మళయాలంలో CIA సినిమా చూడండి.‌ కామ్రేడ్ లక్షణాలు, సిద్ధాంతాల కోసం‌ పోరాటం, ప్రేమకోసం ఆయన ప్రయాణం, ఈ ప్రయాణంలో అతని ఓటమి, గెలుపు, త్యాగం ఏంటో చూస్తే అర్థం అవుతుంది కామ్రేడ్ విలువ..‌ అట్లాగే అమృత, ఉస్తాద్ హోటల్, తుపాకి, భీమిలి, జెండాపై కపి రాజు, మొన్న వచ్చిన దొరసాని వంటి సినిమాలు చూడండి.. కామ్రేడ్ పదం తో సంబంధం లేకపోయినా ఆ ఒక‌ లక్ష్యం కోసం కామ్రేడ్ చేసే పోరాటం, కామ్రేడ్ చేసే త్యాగం, అతని జీవితంలో తోడుండే ప్రేమ, అందులోని‌ ఘాడత వంటి అంశాలు అన్నీ కనిపిస్తాయి.
-Source : వినోద్ మామిడాల Facebook Timeline

Read more RELATED
Recommended to you

Latest news