విజేతలవ్వాలంటే ఈ డజను అలవాట్లను వదిలేయాలి

-

ఎవరైనా విజేత కావాలంటే, వారి లక్ష్యం అత్యంత స్పష్టంగా ఉండాలి. దాన్ని చేరుకునేందుకు మార్గం కూడా వారే వేసుకోవాలి. ప్రణాళికాబద్ధమైన ఆచరణ అందుకు మొదటి అడుగు. దీనికి అడ్డుపడే ఎటువంటి అలవాట్లనయినా వదిలేయాల్సిందే. విజేతలయినవాళ్లు వదిలేసిన ఓ పన్నెండు అనుత్పాదక అలవాట్లు ఇవే.

1. అతిగా పనిచేయడం

అనవసరమైన పనులు నెత్తికెత్తుకుని, సమయాన్ని వృధా చేయడం మేధావులకు తగని పని. నిజానికి విజేతలకు మంచి పని సూత్రం ఉంటుంది. వాళ్లకు వారి పరిధులేమిటో బాగా తెలుసు. వృధాశ్రమ ఎప్పుడూ మంచి సమయ పాలనా నైపుణ్యం కాదు. మన పరిధులేమిటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి.

unfollow these 12 habits if you want to be successful
unfollow these 12 habits if you want to be successful

2. దృష్టిని మరలించే ఉపకరణాలు

ఒకసారి గోల్డామెయిర్‌ సామెతను గుర్తుకుతెచ్చుకుందాం. ‘‘సాంకేతకతను మనం పాలించాలి. అది మనల్ని పాలించకూడదు’’. విజేతలెప్పుడూ గంటలుగంటలు ఫేస్‌బుక్‌, ట్విటర్‌లలో ఉండరు. పనిచేసేప్పుడు వారి ఫోన్లెప్పుడూ సైలెంట్‌మోడ్‌లోనే ఉంటాయి. సాంకేతికత విషయంలో బాధ్యతగా మెలగాలి. ఇందుకు కొంత స్వీయ క్రమశిక్షణ అవసరం.

3. ప్రణాళికాలోపం

‘ప్రణాళిక వేసుకోవడంలో పరాజితులవడమంటే, పరాజయానికి ప్రణాళిక వేసినట్లు’. ఏ పనికైనా ఒక క్రమశిక్షణాయుత ప్రణాళిక అవసరం. ఇది అనవసర శ్రమను, వృధాసమయాన్ని తగ్గిస్తుంది. ‘‘ఇప్పుడే నేనేం చేయాలి?’’ అనే పరిస్థితే రాదు. ప్రణాళికంటే మరీ ఏం చేయాలో లెక్కవేసుకని చేయక్కరలేదు. చేయాల్సినవాటిపై ఒక స్పష్టమైన దృష్టి ఉంటే చాలు.

4. దృష్టి వికేంద్రీకరణ

మన ప్రాధాన్యతలను మాటిమాటికి మార్చడం మంచి అలవాటు కాదు. లక్ష్యంపై గురి ఉన్నవాడు ఏ రోజైనా మొదటిపని, రెండోపని, మూడోపనులను గుర్తించి చేయగలడు. తద్వారా అనవసరమైన అయోమయానికి ఎప్పుడూ తావివ్వడు.

5. పనులు ఆలస్యంగా చేయడం

ఇది ఉద్యోగంలో పనిగంటల గురించి కాదు. మన మీద మనమే వేసుకునేవి. ఎప్పుడో ఒకసారి పనులు ఆలస్యంగా జరిగితే పరవాలేదు కానీ, అదేపనిగా అలస్యమయితే మాత్రం ఒకసారి మన పని పట్టికను తనిఖీ చేసుకోవాల్సిందే. ఆలస్యం వల్ల పనులు వెనక్కి జరుగుతుంటాయి. తద్వారా మీ షెడ్యూల్‌ దెబ్బతినే ప్రమాదముంటుంది.

unfollow these 12 habits if you want to be successful
unfollow these 12 habits if you want to be successful

6. పనులు మధ్యలో వదిలేయడం

విజేతలెప్పుడూ పనులు ముగించడంలో సిద్ధహస్తులు. బద్దకించడం, ఊరికే కూర్చోవడం, వాయిదా వేయడం అనేవి వీరికి బద్ద శత్రువులు. సమయానికి ఉండే విలువేంటో వీరికి బాగా తెలుసు. టైమును వేస్ట్‌ చేయడమంటే, మన లక్ష్యాన్ని మనమనే దూరం చేసుకుంటున్నట్లు. మొదలైన ఏ పనినీ అయిపోయేదాకా వదలొద్దు.

7. వినడంలో అశ్రద్ధ

కొత్త ఆలోచనలను, అభిప్రాయాలను వినకపోవడం లేదా శ్రద్ధ పెట్టకపోవడమనేది పెద్ద దురలవాటు. ఇది సాధారణంగా మనం చేసేదాని కన్నా, బాగా ఆలోచించగలమనే అతివిశ్వాసం వల్ల జరుగుతుంది. శ్రద్ధగా వినడం, చెప్పే విషయాల పట్ల ఆసక్తి కనబరచడం అనే రెండు లక్షణాలు మనల్ని మిగతావారికంటే తొందరగా వివేకవంతులుగా మార్చగలవు.

8. ఒంటరిగా ఉండటం

నలుగురితో కలవకపోవడం, ఏదైనా పనిని పంచుకోకపోవడం మనకు వచ్చే అవకాశాల్ని తగ్గిస్తుంది. అంతేకాక, అధికశ్రమకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇది అలవాటయితే, ఇతరులు కూడా మనల్ని ఒంటరి అని గుర్తించుకుంటారు. సాధారణంగా ఇలా ఉండటం అంతర్ముఖులకు ఎదురయ్యే సమస్య. విజేతలవ్వాలనుకునేవారు సాధ్యమైనంత త్వరగా దీన్నుంచి బయటపడాలి.

9. కొత్త విషయాలు నేర్చుకోకపోవడం

మనల్ని మనమే అభినందించుకోవడం అంటే మన ప్రయాణాన్ని ఆపేసినట్టే. కొత్త విషయాల పట్ల ఆసక్తి, నేర్చుకోవాలనే పట్టుదల విజేలకుండే గొప్ప లక్షణం. మన మెదడు చాలా శక్తివంతమైనది. దానిలోని నిగూఢమైన సామర్థ్యం ఆలోచించే కొలది పెరుగుతుంటుంది. ఇలా మనం కొత్త విషయాలు తెలుసుకునేకొద్దీ, మెదడు కెపాసిటీ కూడా పెరిగి అత్యున్నత ఆలోచనావిధానం అలవడుతుంది. దీనికి అడ్డంకులేవయినా ఉంటే అవి మనం తెచ్చిపెట్టుకున్నవే. రోజూ మెదడుకి పరీక్ష పెట్టండి.

10. అనవసర సమావేశాలు

విజేతలు సాధారణంగా ఏదైనా నాయకత్వ పదివిలోనే ఉంటారు. మనం ప్రఖ్యాతులైన రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలను చూసినట్లయితే, అనవసరంగా, విషయం లేకుండా అసలు మాట్లాడరు. అలాగే సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి గంటలుగంటలు మీటింగులు కూడా ఏర్పాటు చేయరు. ఎక్కువ వినడం, తక్కువ మాట్లాడం విజేతల అలవాటు.

11. క్రమపద్ధతిలో ఉండకపోవడం

పద్ధతిగా ఉండటమంటే నీట్‌గా డ్రెస్‌ వేసుకోవడం, మంచిగా ప్రవర్తించడం గురించి కాదు. మనకు సంబంధించిన అన్ని ‘విషయాలు’ ఒక క్రమపద్ధతిలో అమర్చుకోవడం – జ్ఞాపకాల్లో ఉండేవాటితో సహా. ఎప్పుడంటే అప్పుడు వాటిని నేరుగా బయటికి తీయగలగాలి. లైబ్రరీలో పుస్తకాలలాగా. గ్రంథాలయంలో పుస్తకాలు వాటి విషయం ప్రకారం ఒక పద్ధతిలో అమర్చబడిఉంటాయని మనకు తెలుసు. ఏ గ్రంథం కావాలన్నా, డైరెక్టుగా ఆ ర్యాక్‌ వద్దకు వెళ్లి అదే బుక్‌ను తీస్తారు. అలాగే మనం కూడా అలా విషయాలను అమర్చుకుంటే, అనవసర అయోమయానికి గురి కానక్కరలేదు. దీనికి మీరే ఓ పద్థతిని అవలంబించండి. దానికి కట్టుబడిఉండండి.

12. అనవసర అంతరాయాలను పక్కనపెట్టకపోవడం

మనం పనిలో ఉన్నప్పుడు అనవసర అంతరాయమేర్పడితే, రెండు రకాల నష్టం జరుగుతుంది. ఒకటి, మనం చేస్తున్న పని నుండి మనసు దారి మళ్లడం. రెండోది, భయంకరమైన టైం వేస్ట్‌. పరిశోధనల ప్రకారం, ఒకసారి అంతరాయమేర్పడితే, తిరిగి పని మీద ఏకాగ్రత కుదరడానికి 25 నిమిషాలు పడుతుందట. అందుకే అనవసర విషయాలు డిస్టర్బ్‌ చేస్తుంటే, నిర్మొహమాటంగా ‘నో’, లేదా పనిలో ఉన్నానని చెప్పడంలో ఎలాంటి ఇబ్బందీ పడొద్దు. ఇటువంటి వాటికోసం తగిన సమయాన్ని వేరేగా కేటాయించండి.

విజేతలవడం బ్రహ్మవిద్యేమీ కాదు. కావాల్సిందల్లా అకుంఠిత దీక్ష, పట్టుదల, కఠోర శ్రమ. అన్నింటికంటే ముందుగా మన లక్ష్యం పట్ల మనకు పూర్తి స్పష్టత ఉండాలి. రెండు పడవల మీద కాళ్లు వేయడం ఎప్పటికీ మంచిది కాదు. మీకు ఏం కావాలో ఖచ్చితత్వంతో నిర్ణయించుకోండి. ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత దాన్ని చేరుకోవడానికి మార్గాలు వెతకండి. ఆ దారిలో పయనించడానికి కావాల్సిన ప్రణాళిక, దాన్ని అనుసరించే దీక్ష, పట్టుదల, ధైర్యం, శ్రమ ఉంటే చాలు. ఎంత పెద్ద లక్ష్యమయినా మీ వశమవుతుంది.

– చంద్రకిరణ్‌

Read more RELATED
Recommended to you

Latest news