ఎవ‌రు మూవీ రివ్యూ, రేటింగ్‌..!

-

గూఢ‌చారి మూవీతో అడివి శేష్ ప్రేక్ష‌కుల‌ను ఎలా అల‌రించాడో అంద‌రికీ తెలిసిందే. ఊహించ‌ని ట్విస్టుల‌తో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఆ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. తాజాగా ఎవ‌రు మూవీతో మ‌ళ్లీ అత‌ను మ‌న ముందుకు వ‌చ్చాడు.

మూవీ: ఎవ‌రు
న‌టీన‌టులు: అడివి శేష్‌, రెజీనా, న‌వీన్ చంద్ర‌, ముర‌ళీ శ‌ర్మ
నిర్మాత‌: పీవీపీ
ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్ రాం జీ

గూఢ‌చారి మూవీతో అడివి శేష్ ప్రేక్ష‌కుల‌ను ఎలా అల‌రించాడో అంద‌రికీ తెలిసిందే. ఊహించ‌ని ట్విస్టుల‌తో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఆ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అదే ఊపుతో అడివి శేష్ మ‌రిన్ని సినిమాల‌తో బిజీ అయ్యాడు. వాటిలో తాజాగా ఎవ‌రు మూవీతో మ‌ళ్లీ అత‌ను మ‌న ముందుకు వ‌చ్చాడు. మ‌రి గూఢ‌చారి సినిమాలా ఎవ‌రు మూవీ కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రించిందా ? అడివి శేష్ ఈ మూవీలో ఏం మ్యాజిక్ చేశాడు ? ఈ మూవీతో అడివి శేష్ మ‌రొక హిట్ కొట్టాడా..? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

evaru movie review rating

క‌థ‌…

మ‌ధ్య త‌ర‌గతి కుటుంబానిక చెందిన స‌మీరా (రెజీనా) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో రిసెప్ష‌నిస్టుగా పనిచేస్తుంటుంది. ఆ కంపెనీ బాస్‌కు ఆమె న‌చ్చుతుంది. దీంతో అత‌ను ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అయితే స‌మీరాకు త‌న భ‌ర్త‌తో శారీర‌క సంబంధం ఉండ‌దు. దీంతో ఆమె త‌న స్నేహితుడైన పోలీస్ ఆఫీస‌ర్ అశోక్ (న‌వీన్ చంద్ర‌)తో స‌న్నిహితంగా ఉంటుంది. వీరిద్ద‌రూ క‌లిసి త‌మిళ‌నాడులోని కూనూర్ ప్రాంతానికి వెళ్తారు. అయితే అక్క‌డ అనుకోకుండా స‌మీరాపై అత్యాచారం జ‌రుగుతుంది. అశోక్ హ‌త్య‌కు గుర‌వుతాడు. ఈ క్ర‌మంలో మ‌రోవైపు అదే ప్రాంతంలో రిసార్ట్స్‌ను నిర్వ‌హించే విన‌య్ వ‌ర్మ (ముర‌ళీ శ‌ర్మ‌) కనిపించ‌కుండా పోతాడు. అత‌న్ని వెతుక్కుంటూ క్యాన్స‌ర్ పేషెంట్ అయిన అత‌ని కుమారుడు రాహుల్ (నిహాల్‌) పోలీస్ స్టేష‌న్ చుట్టూ తిరుగుతుంటాడు. ఇక అదే స్టేషన్‌లో విక్ర‌మ్ వాసుదేవ్ (అడివి శేష్‌) ఎస్ఐగా ప‌నిచేస్తుంటాడు. ఈ క్ర‌మంలో అస‌లు అశోక్‌ను హ‌త్య చేసిందెవ‌రు ? స‌మీరాని రేప్ చేసింది ఎవ‌రు ? విన‌య్ వ‌ర్మ ఎవ‌రు ? ఎందుకు క‌నిపించ‌కుండా పోతాడు ? అన్న వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

నటీనటులు, సాంకేతిక నిపుణుల ప‌నితీరు…

గూఢ‌చారి సినిమాలో అల‌రించిన‌ట్లుగానే అడివి శేష్ ఎవ‌రు మూవీలోనూ చ‌క్క‌ని న‌ట‌నను ప్ర‌దర్శించాడు. సాధార‌ణంగా అత‌ని సినిమాల్లో ఒక్కో దాంట్లో ఒక్కో విధంగా అత‌ని పాత్ర చిత్రీక‌ర‌ణ ఉంటుంది. అందులో భాగంగానే ఎవ‌రు మూవీలోనూ అడివి శేష్ క్యారెక్ట‌ర్‌ను భిన్నంగా తీర్చిదిద్దారు. సాధార‌ణంగా ఏ మూవీలో అయినా హీరో క్యారెక్ట‌ర్‌ను ఎస్టాబ్లిష్ చేసే సీన్లు ఉంటాయి. కానీ ఇందులో ఆ హంగామా ఏమీ లేకుండానే నేరుగా క‌థ‌లోకి ఎంట‌ర్ అవుతాం. ఇక యాక్ష‌న్‌, రొమాంటిక్ స‌న్నివేశాలు లేకుండానే అడివి శేష్ హీరోయిజం ఎలివేట్ అవుతుంది. లంచగొండి ఎస్ఐగా అడివి శేష్ ఈ మూవీలో త‌న పాత్ర‌కు త‌గిన న్యాయం చేశాడు. ఇక రెజీనా విష‌యానికి వ‌స్తే.. ఆమె ఈ మూవీలో స‌మీరా పాత్ర‌లో అద్భుతంగా న‌టించింది. ఆమెకు ఈ మూవీలో న‌ట‌న‌ప‌రంగా మంచి మార్కులే ప‌డ‌తాయి. ఇక మిగిలిన న‌టీనటులు కూడా త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర ఈ మూవీలో బాగానే న‌టించారు.

సాధార‌ణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో అడుగ‌డుగునా ప్రేక్ష‌కుల‌ను ఉత్కంఠ‌కు గురి చేసే సీన్లు ఉండాలి.. త‌రువాత ఏం జ‌రుగుతుందోనిన వారు సీటులో క‌ద‌ల‌కుండా కూర్చోవాలి.. ఊపిరి ఉగ్గ‌బ‌ట్టుకుని సినిమా చూడాలి.. స‌రిగ్గా ఎవ‌రు మూవీ కూడా ప్రేక్ష‌కుల‌ను ఇలాగే అనుక్ష‌ణం ఉత్కంఠ‌కు గురి చేస్తుంది. త‌రువాత ఏం జ‌రుగుతుందో వారు గోళ్లు కొరుకుతూ మూవీని చూస్తారు. ఆ ఫ‌లితం రాబ‌ట్ట‌డంలో ద‌ర్శ‌కుడు చాలా స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్ప‌వ‌చ్చు. ఒక ప్ర‌శ్న ఉత్న‌న్న‌మైతే దాని చిక్కుముడులు విప్పే సంద‌ర్భంలో మ‌రిన్ని స‌మ‌స్య‌లు ఎదుర‌వ‌డం, ఒక్కో ప్ర‌శ్న‌ను ఛేదించుకుంటూ ముందుకు సాగ‌డం, అడుగడుగునా ట్విస్టుల‌తో ఎవ‌రు మూవీ ప్రేక్ష‌కుల‌ను అలరిస్తుంది. మొత్తంగా ఓ నిజ‌మైన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చూస్తున్నామ‌నే భావ‌న ప్రేక్ష‌కుల‌కు క‌లుగుతుంది.

ఎవ‌రు మూవీకి సంభాష‌ణ‌లు, సినిమాటోగ్ర‌ఫీ అద‌నపు బ‌ల‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. మూవీ మొత్తం ఐదారు లొకేషన్ల‌లోనే తీసినా.. కెమెరా ప‌నితనంలో అదేమీ క‌నిపించ‌దు. ఇక లొకేషన్స్‌ను కూడా అద్భుతంగా చూపించారు. గ్రాఫిక్స్‌కు ఈ మూవీలో పెద్ద‌గా స్కోప్ లేదు. ఎవ‌రు మూవీకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా అందించారు. పాట‌లు కూడా మూవీలో ఒక భాగంగా మ‌న‌కు క‌నిపిస్తాయి. ఇక మూవీ నిడివి త‌క్కువ కావ‌డంతో ఎక్క‌డా బోర్ కొట్ట‌దు. ఎడిటింగ్ ఫ‌ర్వాలేద‌నిపించారు.

విశ్లేష‌ణ‌…

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీల‌ను చూసేవారికి ఎవ‌రు సినిమా తాజా ఫీలింగ్‌ను ఇస్తుంది. అయితే ఈ మూవీ ఫస్టాఫ్ వ‌చ్చినంత బాగా సెకండాఫ్ రాలేదు. పైగా ప‌లు సీన్లు ప్రేక్ష‌కుల‌కు ఉత్కంఠ క‌లిగించినా.. అక్క‌డ‌క్క‌డా లాజిక్ మిస్ అయిన‌ట్లు అనిపిస్తుంది. అలాగే బీ, సీ సెంట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే మాస్ ఎలిమెంట్లు ఈ మూవీలో లేవు. దీంతో అది ఈ మూవీకి మైన‌స్ అయ్యే అవ‌కాశం ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ ఓవ‌రాల్‌గా చూస్తే.. ఎవ‌రు మూవీని ఎవ‌రైనా స‌రే.. ఒక‌సారి చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు. స‌స్పెన్స్ కోరుకునే వారికి ఈ మూవీ మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఇస్తుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇక అడివి శేష్ ఈ మూవీతో మ‌రొక హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడ‌ని చెప్ప‌వ‌చ్చు. మొత్తంగా ఎవ‌రు మూవీ ఒక్క‌సారి చూడ‌ద‌గిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీ.. అన‌డంలో అతిశ‌యోక్తి లేదు.

ఎవ‌రూ మూవీ రేటింగ్: 3.5/5

Read more RELATED
Recommended to you

Latest news